చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులకు తీపి పదార్థాలు అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా పంచదారకు బదులుగా తేనె లాంటి వాటిని తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మరి డయాబెటిక్స్ అసలు తేనె తినొచ్చా? తినకూడదా? తెలుసుకుందాం రండి.
Diabetic Tips: సాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులు తీపి పదార్థాలను తినకూడదని వైద్యులు చెబుతుంటారు. అయితే పంచదారకు బదులుగా తేనెతో చేసినవి తినొచ్చా? అనే అనుమానం చాలా మందికి కలుగుతుంది. ఇక్కడ తీపి పదార్థాలు అంటే తియ్యగా ఉండే వాటినే కాకుండా కార్బోహైడ్రేట్లను కూడా లెక్కలోకి తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. తీపి పదార్థాలైనా, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండేవి అయినా ఇన్సులిన్ నిరోధకతపై ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు.
పంచదార బదులు తేనె తినొచ్చా? అంటే తినకూడదనే సమాధానమే వినిపిస్తోంది. పంచదార ఎక్కువ గ్లైకమిక్ ఇండెక్స్‌ని కలిగి ఉంటుంది. దీనితో పోలిస్తే తేనె కాస్త తక్కువ గ్లైకమిక్ ఇండెక్స్ విలువ కాస్త తక్కువే. అలాగే తేనెలో కొద్ది మొత్తంలో పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. అలాగే దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. పంచదారలో అవేమీ ఉండవు. కాబట్టి రెండింటిలో ఏదో ఒకటి తినాలని అనుకున్నప్పుడు తేనెను ఎంచుకోవచ్చు. కానీ ఇది కూడా మధుమేహం(Diabetes) ఉన్న వారు తినదగినది కాదని వైద్యులు చెబుతున్నారు.
తేనెలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. కాబట్టి ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో సహకరిస్తాయి. అయితే దీన్ని తినేప్పుడు సహజమైన తేనెను తీసుకుంటున్నామా? లేదా? అనేది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో వస్తున్న చాలా రకాల తేనెల్లో ఎక్కువగా పంచదారే ఉంటోందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అందుకనే దుకాణాల నుంచి కొని తెచ్చుకునే తేనెను డయాబెటిక్ పేషెంట్లు అసలు వాడకుండా ఉండటమే మంచిది. ఎప్పుడైనా తీపి తినాలనిపించినప్పుడు మాత్రం నాణ్యమైన తేనెను కొద్దిగా మాత్రమే రుచి చూడాలి తప్ప ఎక్కువగా కాదు.