Ashwath Kaushik Chess : చెస్‌లో అప్పుడప్పుడూ అద్భుతమైన విజయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన బర్గ్ డోర్ఫర్ స్టాడ్థాస్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో అలాంటి విజయమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారత సంతతికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడు అశ్వత్ కౌశిక్(Ashwath Kaushik) సింగపూర్ తరఫున ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాడు. ఇక్కడే ఈ పిల్లాడు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఉక్రెయిన్‌కు చెందిన 37 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ జెసెక్ స్టోపాను చిత్తు చేశాడు.
ఈ విజయంతో క్లాసికల్ చెస్‌లో గ్రాండ్ మాస్టర్‌ను ఓడించిన అతి చిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. అంతకు ముందు సెర్బియాకు చెందిన లియోనిడ్ ఇవానోవిచ్ నెలకొల్పిన రికార్డును కౌశిక్ బద్ధలుగొట్టాడు. ప్రస్తుతం ఈ బుడతడు ఫిడే ర్యాంకింగ్స్‌లో 37,338 ర్యాంక్‌లో ఉన్నాడు. దీంతో ఇప్పుడు ఈ బాలుడి విజయం అంతటా హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు అశ్వత్ విజయంపై అతడి తండ్రి శ్రీరామ్ కౌశిక్ కూడా ట్విటర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇది అత్యంత గర్వించదగ్గ క్షణాల్లో ఒకటంటూ ట్వీట్ చేశారు.
కౌశిక్ భారత సంతతికి చెందిన వాడే అయినప్పటికీ అతడి కుటుంబం 2017లో సింగపూర్‌కు వలస వెళ్లింది. దీంతో అతడు సింగపూర్ దేశం తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఈస్ట్రన్ ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-8 కేటగిరిలో పోటీపడ్డ ఈ అబ్బాయి అందులోని మూడు విభాగాల్లోనూ గెలుపొందాడు. 2022లో ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-8 క్లాసిక్, ర్యాపిడ్, బ్లిట్జ్ టైటిళ్లు గెలుచుకున్నాడు.