Health Tips: పీరియడ్స్‌లో కాళ్లనొప్పి.. పరిష్కారం ఇదే..!
పీరియడ్స్ సమయంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. విపరీతమైన రక్తస్రావం, కడుపునొప్పి, తుంటిలో బిగుసుకుపోవడంతో పాటు, కొంతమంది మహిళలకు కాళ్లలో విపరీతమైన నొప్పి కూడా ఉంటుంది. నిజానికి ఈ నొప్పి హార్మోన్ల మార్పుల వల్ల వస్తుంది. ఇది సాధారణమైనది. కానీ అది మరింత బాధను కలిగిస్తుంది.
మీరు బహిష్టు సమయంలో కాలు నొప్పితో బాధపడుతుంటే ఈ చిట్కాలు మీకు సహాయపడతాయో లేదో చూడండి. ఈ చిట్కాలతో పాదాల నొప్పిని త్వరగా తగ్గించుకోండి. పీరియడ్స్ సమయంలో ఏ ఇబ్బంది ఉండకుండా ఉండేందుకు కింది చిట్కాలు పాటించడం మంచిది.
హీట్ ప్యాడ్ ఉపయోగించడం:
బహిష్టు సమయంలో పాదాలలో నొప్పి లేదా తిమ్మిర్లు ఉంటే, పాదాలను హీట్ ప్యాడ్‌తో మసాజ్ చేయండి. అది నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. హీట్ ప్యాడ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా నొప్పిని తగ్గిస్తుంది.
మసాజ్:
ఋతుస్రావం సమయంలో పాదాల నొప్పికి మంచి చికిత్సలలో మసాజ్ కూడా ఒకటి. మీరు లావెండర్ లేదా ఆవాల నూనెతో మసాజ్ చేసుకుంటే ఎంతో మంచిది. అది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పాదాలకు మసాజ్ చేయడం వల్ల అలసట తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల ఎంతో రిలాక్స్‌గా అనిపిస్తుంది.
యోగా లేదా వ్యాయామం:
శారీరక వ్యాయామం చేయడం వల్ల ఋతుస్రావం సమయంలో లెగ్ నొప్పి నుండి ఉపశమనం పొందొచ్చు. మీరు శారీరక శ్రమ పడినప్పుడు ఎండార్ఫిన్లు అనేవి విడుదల అవుతాయి. వ్యాయామం రక్త నాళాలలో సరైన రక్త ప్రసరణకు సహాయపడుతుంది. అది నొప్పిని తగ్గిస్తుంది. బహిష్టు సమయంలో యోగా స్ట్రెచింగ్, తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల ఎంతో ఉపశమనం పొందుతారు.
సమతుల్య ఆహారం:
బహిష్టు సమయంలో పోషకాలు లేకపోవడం వల్ల కాళ్లలో నొప్పి, తిమ్మిరి వస్తుంది. అటువంటి పరిస్థితిలో సరైన పోషకాహారం తీసుకోవడం ఎంతో మంచిది. మీ డైట్లో విటమిన్ డి, జింక్, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తింటే మంచిది.
హైడ్రేటెడ్ గా ఉండండి:
ఋతుస్రావం సమయంలో హైడ్రేటెడ్ గా ఉండటం కూడా ముఖ్యం. పుష్కలంగా నీరు తాగడం వల్ల మంట తగ్గుతుంది. అలాగే నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. శరీరంలో నీటి శాతం తక్కువగా ఉన్నప్పుడు తిమ్మిర్లు వేస్తాయని గ్రహించండి. రోజులో కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలని లక్ష్యంగా పెట్టుకోండి. దోసకాయ, పుచ్చకాయ వంటి హైడ్రేటింగ్ ఆహారాలను ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.