Moles Health Problems : మనుషులందరిలోనూ సర్వ సాధారణంగా పుట్టు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. శరీరంలో ఏ భాగం మీదనైనా ఇవి ఉంటాయి. దాదాపుగా 25 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా కొత్త పుట్టుమచ్చలు రావొచ్చు. అయితే ఎప్పుడైనా వీటి పరిమాణం పెరుగుతున్నట్లు అనిపిస్తే అస్సలు అశ్రద్ధ చేయవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
పుట్టు మచ్చలు( Moles) ఉబ్బెత్తుగా మారడం, వాటి పరిమాణంలో మార్పు రావడం, విస్తరిస్తుండటం లాంటివి కనిపిస్తే ఆరోగ్య రీత్యా ప్రమాదంలో ఉన్నట్లే అలాగే అవి అంతకు ముందు ఉన్న రంగు కాకుండా వేరే రంగుకు మార్పు చెందుతున్నా కూడా అప్రమత్తం కావాలి. దీన్ని స్కిన్ క్యాన్సర్ లక్షణంగా వైద్యులు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎండలోకి వెళ్లిన ప్రతిసారి 30 లేదా అంతకంటే ఎక్కువ ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్‌ని తప్పకుండా ఉంపయోగించాలి. అలాగే ఒక వ్యక్తికి 50 కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే వారికి మెలనోమా(Melanoma చర్మ క్యాన్సర్) ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి వారు ఆరు నెలలకు ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పకుండా చేయించుకోవాలి.
పుట్టుమచ్చల( Moles) రంగు, ఆకారం, థిక్నెస్ల్లో ఏమాత్రం మార్పు కనిపించినా వెంటనే చర్మ వైద్యుడిని సంప్రదించండి. వాటిపై స్పర్శ లేకపోవడం, దురద ఉండటం, స్రావాలు కారుతుండటం, రక్తం కారడం లాంటి వాటినీ మనం సీరియస్‌గానే తీసుకోవాలి. అవి కొన్ని రకాల క్యాన్సర్లకు సూచన కావొచ్చు. కాబట్టి వైద్యుడిని సంప్రదించి వాటిపై పరీక్షలు చేయించుకోవాలి.