తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ లపై వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ పాలనలో అన్నదాతల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. రైతుల గోస ఏనాడైనా మీ కంటికి కనపడిందా ? అని కేసీఆర్ను ప్రశ్నించారు. రైతు బంధు ఇస్తున్నామని చెప్పి.. రైతులకు మేలు చేసే రాయితీలు అన్నీ బంద్ చేశారన్నారు. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల సైటైరికల్గా రియాక్టయ్యారు. ఈ మేరకు KCR అనే పదానికి కొత్త అర్థం చెబుతూ ట్వీట్ చేశారు.
KCR అంటే కాలువలు, చెరువులు,రిజర్వాయర్లు కాదు చిన్న దొర కేటీఆర్ K అంటే “కన్నీళ్లు”, C అంటే “చావులు”,R అంటే “రోదనలు” అంటూ కొత్త భాష్యం చెప్పారు. రుణమాఫీకి ఎగనామం, ఉచిత ఎరువులకు పంగనామం, సబ్సిడీ విత్తనాలకు కేసీఆర్ కుచ్చుటోపీ పెట్టాడని అన్నారు. గాలి మోటార్లో తిరిగి గాలి మాటలు చెప్పి నష్టపరిహారం ఎగ్గొట్టాడని అన్నారు. అప్పులపాలై రైతులు ఉరికంభం ఎక్కుతున్నా, కల్లాలపైనే గుండెలు ఆగిపోతున్నా, పురుగుల మందు తాగి నురుగలు కక్కి చచ్చిపోతున్నా ఇక్కడి దొరకు పంజాబ్, హర్యానా రైతులే కనబడుతారని అన్నారు.
భూస్వాములకు లక్షలకు లక్షలు రైతుబంధు ఇచ్చి, కౌలు రైతులను కాటికి పంపుతున్న రాక్షస ప్రభుత్వమిదని పేర్కొన్న ఆయన 60 ఏండ్లకే రైతు బీమాను పరిమితం చేసి, రైతు నుదుట మరణశాసనం రాస్తున్న దాష్టీక ప్రభుత్వమిది అని విమర్శించారు. భూములకు సాగు నీరు అందక, పంటలకు మద్దతు ధర లేక,పండించిన పంటను కొనే దిక్కులేక రైతులు ఆగమైతున్నా దొరగారు గడీ దాటి బయటకు రారని ఆమె అన్నారు. రైతులకు భరోసా ఇవ్వని బంధిపోట్ల రాష్ట్ర సమితి కేటుగాళ్లకు రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.