మాస్ మహారాజా రవితేజ ఈ సారి ఈగల్ గా మారాడు. ఈ ఏడాది చిరుతో కలిసి `వాల్తేరు వీరయ్య`లో మెరిసిన మాస్ రాజా ఆ తరువాత హీరోగా చేసిన `రావణాసుర`తో భారీ ప్లాప్‌ని మూటగట్టుకున్నారు. ప్రస్తుతం స్టూవర్ట్ పురం గంజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న `టైగర్ నాగేశ్వరరావు`లో నటిస్తున్నారు. వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 22న పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలో టీజర్‌ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాతో పాటు యంగ్ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ ఓ భారీ మాసీవ్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.గత చిత్రాలకు పూర్తి భిన్నమైన క్యారెక్టర్లో రవితేజ నటిస్తున్న ఈ మూవీకి `ఈగల్(eagle)` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. సోమవారం టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని మేకర్స్ విడుదల చేశారు. `మాసీవ్ ఎరుప్షన్` అంటూ రెండు రోజులుగా నెట్టింట ప్రమోషన్ చేస్తున్న టీమ్ ఫైనల్‌గా టైటిల్ తో పాటు గ్లింప్స్‌ని విడుదల చేసింది. రవితేజ డిఫరెంట్ మేకోవర్‌తో కనిపిస్తున్న స్టిల్, గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకుంటూ నెట్టింట ట్రెండ్ అవుతోంది. చాలా కాలంగా వైరల్ అవుతున్న పేరునే ఫైనల్‌గా టీమ్ ప్రకటించడం విశేషం. ఈ టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్‌లో రవితేజ క్యారెక్టర్ గురించి రివీల్ చేశారు. `వాంటెడ్ పెయింటర్.. ఒక పెయింటర్ని పట్టుకోవడానికి ఇంత పెద్ద టీమూ.. రా ఏజెన్సీ..` అంటూ ఓ పాప చెబుతున్న డైలాగ్‌లతో రవితేజ క్యారెక్టర్ ఏంటో ..అతని గురించి రా వెతుకుతోందని స్పష్టం చేశారు. `కొంత మంది చూపు మనిషి ఊపరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.
ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటీ?.. ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటీ?` అంటూ అనుపమ చెబుతున్న డైలాగ్‌లు..టైటిల్ డిజైన్ సమయంలో `ఆ చూపే మరణం..ఆ అడుగే సమరం` అంటూ రవితేజ క్యారెక్టర్ ఏ స్థాయిలో పవర్ ఫుల్‌గా సాగనుందో హింట్ ఇచ్చారు. ఇంతకీ ఎవరీ ఈగల్?..అతన్ని రా ఎందుకు వెంటాడుతోంది? ..అన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. రాబిన్ హుడ్ తరహా యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.