విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి వేడుకలు ఉదయ్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహం జరుగనుంది. ఈ పెళ్లికి సినీ ఇండస్ట్రీ నుంచి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, రాహుల్ రవీంద్రన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. రేపు జరగనున్న వివాహ కార్యక్రమంలో కేవలం 100 మంది గెస్ట్‌లు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీలో మరో స్టార్ యాక్టర్ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నటుడు బాలాజీ మనోహర్ ‘భీరా’ అనే ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుపుతూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో మార్చి 19న విడుదల చేయనున్నారు.
తమిళ చిత్రం ‘హాట్‌స్పాట్: 2 మచ్’ తెలుగు వెర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ఈనెల 27 నుంచి అందుబాటులోకి రానుంది. ప్రియా భవానీ శంకర్, భాస్కర్, తంబి రామయ్య, అశ్విన్ కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి విఘ్నేష్ కార్తీక్ దర్శకత్వం వహించాడు. సమాజంలోని సున్నితమైన అంశాలను దర్శకుడు ఈ సినిమాలో వెండితెరపై ఆవిష్కరించాడు.
పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న దక్షిణాది చిత్రాలకు ‘ధురంధర్ 2’ రూపంలో గట్టి పోటీ ఎదురుకాబోతుందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డాడు. దక్షిణాది సినిమాలు సృష్టించిన బెంచ్ మార్క్‌ను ఈ సినిమా తుడిచేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ప్రేక్షకులు ఒక్కసారి ఈ తరహా సినిమా రుచి చూస్తే.. రొటీన్ మసాలా సినిమాలు ప్రమాదంలో పడినట్లేనని RGV హెచ్చరించాడు.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, దర్శకుడు శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ వంటి చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ఈ సక్సెస్‌ఫుల్ కాంబో మరో ప్రాజెక్ట్‌తో రాబోతోంది. అజిత్‌తో మరో సినిమా తీయబోతున్నట్లు శివ తాజాగా ప్రకటించాడు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తానని పేర్కొన్నాడు.
ప్రముఖ టీవీ నటుడు మయాంక్ పవార్ (37) కన్నుమూశాడు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అతడు ఈరోజు తుదిశ్వాస విడిచాడు. సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా, మయాంక్ ఏడుసార్లు మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచాడు.
‘ది కేరళ స్టోరీ-2’ టీజర్ దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఈ చిత్ర కథనం ఉందంటూ టీజర్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే దీనిపై కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. టీజర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని చిత్రబృందాన్ని ఆదేశించింది. దీంతో టీజర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వేడుకల సందడి మొదలైపోయింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఫిబ్రవరి 26న వారి పెళ్లి జరగనుంది. ఈ పెళ్లి వేడుకల కోసం ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు ఉదయపూర్ చేరుకుంటున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా జంటగా ఉదయపూర్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతోంది.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈనెల 26న ఉదయ్‌పుర్‌లో ఘనంగా వివాహం చేసుకోనున్నారు. వీరి పెళ్లి తెలుగు, కన్నడ (కొడవ) సంప్రదాయాల ప్రకారం రెండు పద్ధతుల్లో జరగనుంది. ఉదయం తెలుగు పద్ధతిలో, సాయంత్రం కన్నడ సంప్రదాయంలో వివాహ వేడుకలు నిర్వహిస్తారు. దీంతో ఒకేరోజు వీరిద్దరూ రెండుసార్లు వివాహం చేసుకోబోతున్నారు. కాగా, మార్చి 3న HYDలో రిసెప్షన్ నిర్వహించనున్నారు.
తెలుగు చిత్రసీమలో ఫిల్మ్‌ఫేర్ అవార్డుల సందడి ఎప్పుడూ ఎక్కువే. అత్యధికంగా 7 అవార్డులతో మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలిచారు. వీరి తర్వాత మహేష్ బాబు (5), శోభన్ బాబు, వెంకటేష్ (చెరో 4), ఏఎన్‌ఆర్, కృష్ణంరాజు, ఎన్టీఆర్, రామ్ చరణ్ మూడు అవార్డుల చొప్పున అందుకున్నారు.
తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ మామూలుగా లేదు. ప్రస్తుతం ఆయన చేతిలో ఏకంగా 8 సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో మూవీకి ప్రదీప్ రూ.25 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. ఆయనకున్న యూత్ ఫాలోయింగ్‌తో నిర్మాతలు అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, వచ్చే రెండేళ్ల వరకు ప్రదీప్ డేట్లు ఖాళీ లేవట. ఆయన షెడ్యూల్ అంతలా లాక్ అయిపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
దుబాయ్ వేదికగా అల్లు శిరీష్ ఇచ్చిన పార్టీకి రామ్ చరణ్ అయ్యప్ప మాలలో హాజరవ్వడంపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దీనిపై శిరీష్ స్పందిస్తూ.. ‘చరణ్ పార్టీ మొదలవ్వక ముందే వచ్చి, మమ్మల్ని ఆశీర్వదించి వెంటనే వెళ్లిపోయారు. అక్కడ మద్యం లేదు, అపచారం జరగలేదు. ఆయన భక్తిని ఎవరూ వేలెత్తి చూపలేరు’ అని ఘాటుగా బదులిచ్చాడు. విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికాడు.
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది. 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.12.67 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించాడు.
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాల ‘స్పిరిట్’ మూవీలో విలన్‌గా కొరియన్ స్టార్ డాన్ లీ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై అభిమానులు వంగాను ప్రశ్నించగా.. ‘మీరు అనుకున్నట్టే జరుగుతుంది’ అని హింట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో మార్చి 1న డాన్ లీ బర్త్ డే సందర్భంగా ఈ అంశంపై అధికారిక ప్రకటన లేదా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
‘కాంతార’ సీన్ ఇమిటేషన్ వివాదంలో రణ్‌వీర్ సింగ్‌కు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. మతపరమైన మనోభావాలు దెబ్బతీశారన్న కేసులో అతనిపై ప్రస్తుతానికి కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తునకు రణ్‌వీర్ పూర్తిగా సహకరించాలని షరతు విధించింది. అజ్ఞానంతో చేసినా ఇలాంటి పనులు సరికాదని హితవు పలికింది. తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేసింది.