ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిల సినిమాల కోసం తాను తన తెలుగు వర్షన్ వారసుడు సినిమానా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలామంది తనపై పడి ఏడుస్తున్నారని, థియేటర్లు మొత్తం తానే తీసుకుంటున్నట్లు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర నటుల సినిమాలకు ఎక్కువ థియేటర్లు అవసరమవుతాయని, అందుకే తాను ఒక అడుగు వెనక్కి తగ్గి, విజయ్ నటించిన తన వారసుడు సినిమా తేదీని మారుస్తున్నట్లు చెప్పారు.
వారసుడు సినిమాను 11వ తేదీన విడుదల చేయాలని తాము చర్చించుకుంటున్న సమయంలోనే, ఈ అంశం బయటకు వచ్చిందని, దీంతో తనపై అందరు పడి ఏడుస్తున్నారన్నారు. పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నారు. అందుకే తన సినిమాను 14వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. చిరు, బాలయ్య సినిమాలకు తన వారసుడు పోటీ కాదని, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తమిళ వర్షన్ 11న విడుదలవుతుందని, తెలుగులో మాత్రం 14న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలో అందరితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తాను సినిమా విడుదలను నమ్మడం లేదని, ఈ సినిమాపై తనకు ఉన్న నమ్మకం, సూపర్ డూపర్ హిట్టు కొట్టడం ఖాయమన్నారు. ఇది మంచి సినిమా అని, ప్రేక్షకుల ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. తాను గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి, ఎఫ్2 వంటి చిత్రాలను సంక్రాంతికి అందించానని, ఇది కూడా అదే కోవలోకి వస్తుందన్నారు. సూపర్ డూపర్ హిట్ ఖాయమన్నారు. జనవరి 12న బాలకృష్ణ, 13న చిరంజీవి విడుదలవుతోందని, అందుకే తాను తన సినిమాను 11 నుండి 14కు మార్చుకున్నట్లు తెలిపారు. వాళ్లకు థియేటర్లు దొరకాలని, ఆ తర్వాతనే మాకు అన్నారు. నేనొక్కడినే కాదని, అందరూ బాగుండాలన్నారు. ఎవరు ఇబ్బంది పడవద్దనే తాను ఒకడుగు వెనక్కి వేశానన్నారు.