Amarnath Yatra: సహజనటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సాయిపల్లవి(SaiPallavi) ప్రస్తుతం తల్లిదండ్రలతో కలిసి అమర్నాథ్(Amarnath) యాత్రలో ఉన్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ ఎమోషనల్ పోస్ట్ తో కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ఎప్పుడూ వ్యక్తిగత ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకొని ఈమె కొన్ని యాత్రకు సంబంధించిన పిక్స్ పెట్టడంతో అందరూ తాను ఎక్కడికి వెళ్లింది అని ఆరా తీశారు. తాజాగా పెట్టిన పోస్ట్ లతో సాయి పల్లవి అమర్నాథ యాత్రలో ఉన్నట్లు అర్థం అవుతుంది. ఈ యాత్రను తాను ఎప్పటినుంచో చేయాలని భావించిందంట కానీ ఇప్పటికి కుదిరింది అని రాసుకొచ్చింది.
వ్యక్తిగత విషయాలన పెద్దగా పంచుకోని తాను అమర్నాథ్(Amarnath) యాత్ర తీర్థయాత్ర గురించి అందరికీ చెప్పాలనుకుంటున్నాని, ఎంతోకాలం నుంచి వెళ్లాలని కలలు కన్న యాత్ర ఇది. 60 ఏళ్ల వయసున్న తల్లిదండ్రులను ఈ యాత్రకు తీసుకువెళ్లడం ఎన్నో సవాళ్లు విసిరిందని తెలిపారు. ఈ యాత్రలో కొన్నిసార్లు వాళ్లు ఊపిరి తీసుకోవడానికి ఆయాసపడుతూ ఛాతి పట్టుకోవడం, దారి మధ్యలో అలిసిపోవడంతో స్వామీ.. మీరు ఎందుకు ఇంత దూరంలో ఉన్నారు అని ప్రశ్నించుకున్నట్లు తెలిపింది. అయితే దైవ దర్శనం అనంతరం తన ప్రశ్నకు సమాధానం దొరికిందట. కొండ దిగి కిందకు వచ్చేటప్పుడు మనసుని హత్తుకునే దృశ్యాన్ని చూశానని రాసుకొచ్చారు.
యాత్రను కొనసాగించలేక పలువురు యాత్రికులు ఇబ్బందిపడుతూ ఉండగా.. వాళ్లలో ధైర్యం నింపడం కోసం చుట్టు పక్కన ఉన్నవాళ్లందరూ ఓం నమః శివాయా అంటూ ఆ స్వామి నామాన్ని గట్టిగా స్మరించారు. వెళ్లలేం అనుకున్న యాత్రికులు కూడా ఒక్కసారిగా స్వామి వారిని తలచుకుని ముందుకు అడుగులు వేశారు. తమలాంటి లక్షలాది మంది భక్తులకు ఈ యాత్రను చిరస్మరణీయం చేసిన శ్రీ అమర్నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డులోని ప్రతి ఒక్కరికీ తన ప్రణామాలు అని, అలాగే భక్తులను అన్నివేళల్లో సంరక్షిస్తున్న ఆర్మీ/సీఆర్పీఎఫ్/పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
నిస్వార్థ సేవలకు ఇది సాక్షిగా నిలుస్తుంది కాబట్టే ఈ ప్రదేశం శక్తిమంతమైంది. సంపద, అందం, పవర్‌తో సంబంధం లేకుండా ఇతరులకు సాయం చేయడమే ఈ భూమిపై మన ప్రయాణానికి ఒక విలువని ఇస్తుంది. ఈ అమర్నాథ్ యాత్ర తన సంకల్ప శక్తిని సవాలు చేయడంతోపాటు తన ధైర్యాన్ని పరీక్షించింది. మన జీవితమే ఒక తీర్థయాత్ర అని తెలిసేలా చేసింది. మనిషిగా ఉన్నందుకు ఎదుటి వ్యక్తులకు సాయం చేయకపోతే మనం చనిపోయిన వాళ్లతో సమానమని తెలియజేసింది అని సాయిపల్లవి తన పోస్ట్ పెట్టారు.