హిందువులు జరుపుకునే పండగల్లో అతి ముఖ్యమైన పండగ మహా శివరాత్రి. ఆ రోజు లింగోద్భవం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా శివ, పార్వతులకు వివాహం జరిగిన రోజు కూడా అదే. ఆ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజుగా భావించి భక్తులు అత్యంత భక్తితో పూజలు నిర్వహిస్తారు. ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 18వ తేదిన రానుంది. ఈ నేపథ్యంలో శైవ క్షేత్రాలు శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్నాయి. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలంలో మల్లన్న, భ్రమరాంబల కళ్యాణానికి, బ్రహ్మోత్సవాలకు అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీశైలం దేవస్థానంలో ఫిబ్రవరి 11 నుంచి 21వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో లవన్న తెలిపారు. కృష్ణ దేవరాయగోపురం, నాగులకట్ట, అమ్మవారి ఆలయం , కల్యాణ మండపం, శ్రీస్వామివారి నిత్య కల్యాణ మండప ప్రాంగణాన్ని అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం క్యూలైన్లకుంటే కొంచెం ఎత్తులో మరో క్యూలైన్ ఏర్పాటు చేసి భక్తులు స్వామివారిని సులువుగా దర్శించుకుంటారని తెలిపారు. వీవీఐపీలకు, వీఐపీలకు వేర్వేరుగా గ్యాలరీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.