Ayodhya Ram Mandhir: అంగరంగ వైభవంగా అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్ర్రమానికి ప్రముఖులు, సినీ, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ప్రస్తుతం దేశమంతా రామనామం జపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అయోధ్య రామమందిరంలో బాలరాముడికి అంకితమిస్తూ భక్తి సంగీత ఉత్సవాన్ని మొదలుపెట్టారు. నిన్న మొదలైన ఈ కార్యక్రమం 45 రోజుల పాటు కొనసాగుతుంది. నిన్నటి నుంచి మార్చి 10 వరకు ఈ సంగీత ఉత్సవం కొనసాగుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులు తెలిపారు.
శాస్త్రీయ సంప్రదాయానికి అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, కళా సంప్రదాయాలకు చెందిన 100 మందికి పైగా ప్రసిద్ధ కళాకారులు రాముడి పాదాల చెంత రాగ సేవ అందిస్తారు. వైజంతిమాల, హేమమాలిని, అనూప్ జలోటా, అనురాధ పౌడ్వాల్, మాలిని అవస్థీ, సోనాల్ మాన్సింగ్, సురేశ్ వాడ్కర్, పద్మా సుబ్రహ్మణ్యం వంటి ప్రముఖులు ఇందులో పాల్గొని ప్రదర్శనలు ఇవ్వనున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన 50 సంగీత వాయిద్యాలు మంగళ ధ్వనిలో భాగం కానున్నాయి. ఈ వేడుకకు యతీంద్ర మిశ్ర సమన్వయకర్తగా వ్యవహరిస్తుండగా.. ఢిల్లీ సంగీత నాటక అకాడమీ సహకరిస్తోంది.