Minister Roja: తెలంగాణలో ఛీ కొడితే షర్మిల ఏపీకి వచ్చింది : మంత్రి రోజా
ఏపీకి షర్మిల ఏం మొహం పెట్టుకుని వచ్చిందని మంత్రి రోజా ప్రశ్నించారు. తెలంగాణలో ఛీ కొడితే ఏపీకి వచ్చి చేరిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా ప్రజలు జగనన్న ప్రభుత్వానికే పట్టం కడుతారన్నారు.
సంక్రాంతికి వచ్చే డుడూ బసవన్నలా ఏపీ రాజకీయాల్లోకి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వచ్చిందని మంత్రి రోజా అన్నారు. ఆమె ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా జగనన్నను ఏం చేయలేరని అన్నారు. వైఎస్సార్ అభిమానులంతా సీఎం జగన్ వెంటే ఉన్నారని మంత్రి రోజా తెలిపారు. విజయవాడలోని బాపు మ్యూజియంలో నేడు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో లేజర్, సౌండ్ లైట్ షోను ఆమె ప్రారంభించారు. ఈ సౌండ్ అండ్ లైట్ షో ప్రారంభానికి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరయ్యారు.
మంత్రి రోజా మాట్లాడుతూ..తెలంగాణలో ప్రజలు ఛీ కొడితే వైఎస్ షర్మిల ఏపీలోకి వచ్చారన్నారు. సీఎం జగన్ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. జగన్ పాలనపై ఏపీ ప్రజలంతా సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి కనిపిస్తోందని మంత్రి రోజా అన్నారు. ప్రతి కుటుంబంలో వైసీపీ పథకాలు అమలు అవుతున్నాయన్నారు.
వైసీపీ పాలనలో విజయవాడలో అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, బాపూ మ్యూజియం, భవాని ఐలాండ్ వంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేశామని అన్నారు. వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాక వైఎస్ షర్మిల తమ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోందన్నారు. సీఎం జగన్పై విరుచుకుపడుతున్నారని, అలా చేస్తుంటూ ప్రజలు చూస్తూ ఊరుకోరని మంత్రి రోజా అన్నారు.