ఇప్పుడున్నది వాట్సాప్ (WhatsApp) యుగం. పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకూ వాట్సాప్ వాడటం అందరూ అలవాటు చేసుకున్నారు. అరచేతిలోని స్మార్ట్ ఫోన్లో (Smart Phones) ఫుడ్ ఆర్డర్, క్యాబ్ బుకింగ్, ప్రయాణ టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. అన్ని పనులు స్మార్ట్ ఫోన్‌తోనే పూర్తిచేసుకుంటున్నారు. టెక్నాలజీ ఓ వైపు ఇలా పరుగులు పెడుతుంటే మరోవైపు ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫేక్ వాట్సాప్, ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారు.
మరోవైపు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలని హ్యాకర్లు, సైబర్ మోసగాళ్లు వాట్సాప్ సందేశాలను పంపుతూ డబ్బులు దోచేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సైబర్ మోసాలు మరీ ఎక్కువయ్యాయి. తాజాగా మరో మోసం వెలుగుచూసింది. అమెరికా అధికారులని చెప్పి, ఒకే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులుగానూ, పెద్ద పెద్ద కంపెనీలలో సీఈవోలను చెప్పి కస్టమర్ల నుంచి దోచుకుంటున్నారు.
ఓ కంపెనీలో పనిచేసే వ్యక్తికి అమెరికా నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. పదే పదే ఆ నంబర్ నుంచి ఫోన్ కాల్స్ రావడంతో ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. మరోవైపు ఫుడ్ ఆర్డర్ పెట్టిన ఓ వ్యక్తికి వాట్సాప్ లో ఏదో లింక్ వచ్చింది. ఆ లింక్ క్లిక్ చేయగానే అకౌంట్లో డబ్బులు మాయం అయ్యాయి. నిరుద్యోగులకు అయితే ఉద్యోగాల పేరుతో ఇంటర్నేషనల్ ఫోన్ నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్, మెసేజులు రావడంతో చాలా మంది తికమకపడుతూ మోసపోతున్నారు. ఇలాంటి ఫేక్ మెస్సేజుల పట్ల అలర్ట్‌గా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.