Wanaparthy:తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. ఉన్నత చదువులు చదివి తమను బాగా చూసుకుంటాడనుకున్న తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి మృతి చెందాడు. గదిలో నిద్రిస్తున్న ఆయన నిద్రలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా అమెరికాలో జరిగిన పలు ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మృతి చెందారు.
వనపర్తి పట్టణంలోని 26వ వార్డుకు చెందిన గట్టు వెంకన్న కుమారుడు దినేష్. హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేసిన దినేష్ ఎంఎస్ కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ తన స్నేహితులతో కలిసి ఓ గదిలో ఉంటాడు. శనివారం గదిలో నిద్రిస్తున్న దినేష్ నిద్రలోనే మృతి చెందాడు. దీంతో దినేష్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. దినేష్ మృతదేహాన్ని అమెరికా నుంచి స్వగ్రామానికి తరలించాలని కుటుంబ సభ్యులు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, సీఎం రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దినేష్ తో పాటు అద్దెకు ఉంటున్న ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో విద్యార్థి కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరి మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.