»Tragedy 18 Killed In Road Accident In Bihar And Chhattisgarh
Road Accident నెత్తురోడిన రోడ్లు.. రోడ్డు ప్రమాదాల్లో 18 మంది దుర్మరణం
అతివేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఒక్కసారిగా బొలెరో అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోయింది. ఘటనా స్థలంలోనే 11 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఓ బాలిక కూడా ఉంది.
దేశంలో రహదారులు (Roads) రక్తమోడాయి. రోడ్లపై నెత్తురు పారింది. పలు చోట్ల చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) దాదాపు 18 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. చత్తీస్ గడ్ (Chhattisgarh) లో 11 మంది మృతి చెందగా.. బిహార్ (Bihar)లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘోర రోడ్డు ప్రమాదాలపై ముఖ్యమంత్రి భూపేశ్ బగేల్ (Bhupesh Baghel), నితీశ్ కుమార్ (Nitish Kumar) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
బొలెరో, ట్రక్కు ఢీ
చత్తీస్ గఢ్ లోని బాలోద్ జిల్లాలో (Balod District) బొలేరో వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ సంఘటనలో బొలెరోలో (Bolero) ప్రయాణిస్తున్న 11 మంది మృతి చెందారు. ధామ్ తరి జిల్లా (Dhamtari District) సోరెమ్ భట్ గావ్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారంతా కాంకేర్ జిల్లాలో (Kanker District) బంధువుల వివాహానికి బొలెరో వాహనంలో బయల్దేరారు. బుధవారం రాత్రి వీరు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ట్రక్కు (Truck) ఢీకొట్టింది. ఒక్కసారిగా బొలెరో అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోయింది. ఘటనా స్థలంలోనే 11 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఓ బాలిక కూడా ఉంది. మృతదేహాలను రాజధాని రాయ్ పుర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకుని డ్రైవర్ ను వెతుకుతున్నట్లు ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి భూపేశ్ బగెల్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
లారీ ఢీకొని ఏడుగురు
బిహార్ లోని సీతామర్హి (Sitamarhi District) జిల్లా మగొల్వా ప్రాంతంలో ఆటోను (Auto) అతివేగంగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. బుధవారం సాయంత్రం ఓ వివాహ వేడుకకు హాజరై తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణమయ్యారు. పెళ్లికి (Marriage) హాజరైన బంధువులు ఆటోలో వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగిపోయింది. దాదాపు 5 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టానికి, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు సీతామర్హి ఎస్డీఓ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. ఈ ప్రమాదంపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంతాపం తెలిపారు.