మహారాష్ట్రలోని నాసిక్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు తెల్లవారుజామున ఘోర ప్రమాదానికి గురైంది. డీజిల్ రవాణా చేస్తున్న ట్రక్కును బస్సు ఢీకొనడంతో బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 14 మంది సజీవ దహనం కాగా, మరో 24 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
బస్సు యవాత్మల్ నుంచి ముంబై వెళ్తుండగా…ట్రక్కు నాసిక్ నుంచి పూణే వస్తుంది. ఆ క్రమంలో తెల్లవారుజామున 5.15 గంటలకు ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. విషయం తెలిసిన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్రం 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి 50 వేల చొప్పున ఇస్తామని వెల్లడించారు.