మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం జరిగింది. ఒకే రోజు 24 మంది మృతిచెందారు. దీంతో ఆస్పత్రి వద్ద తీవ్ర ఆందోళన నెలకొంది. మృతుల్లో 12 మంది నవజాత శిశువులు కూడా ఉన్నట్లు నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రి డీన్ తెలిపారు. ఆస్పత్రిలో మందుల కొరత, సిబ్బంది కొరత వల్లే ఈ దారుణం జరిగిందని వెల్లడించారు.
గత 24 గంటల్లో ఆస్పత్రిలో 24 మంది మరణించారని, అందులో 12 మంది నవజాత శిశువులు మినహా మిగిలిన వారంతా వ్యాధులు, పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆస్పత్రి డీన్ శంకర్ రావు చవాన్ వెల్లడించారు. సకాలంలో మందులు అందుంటే అందరూ బతికేవారన్నారు. అయితే ఇందులో పాముకాటు కారణంగా మృతిచెందిన వారు ఉన్నారన్నారు. వారిలో కొందరు ఆస్పత్రికి రాగానే మరణించినట్లు తెలిపారు.
ఆస్పత్రిలో పలువురు సిబ్బందిని బదిలీ చేశారని, దీంతో రోగులకు సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మరో వైపు ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రజలు ఆందోళన చేపట్టారు. ఆస్పత్రిలో మరో 70 మంది పరిస్థితి విషమంగా ఉందని, అధికారులు వెంటనే సిబ్బందిని, మందులను చేరవేయాలని ప్రజలు కోరుతున్నారు.