ఢిల్లీ ఎయిమ్స్ లో ఘరానా మోసం బయటపడింది. నీట్ పరీక్షలో విద్యార్థుల స్థానంలో వేరేవారు పరీక్ష రాసినట్లు రుజువైంది. అందుకోసం ఒక్కో విద్యార్థి దగ్గర 7లక్షల వరకు వసూల్ చేసినట్లు తేలింది.
If we give 7 lakhs, we will pass NEET.. Gharana fraud in AIIMS in Delhi
మెడికల్ కాలేజీలో విద్యార్థుల ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షలో భారీ మోసం (NEET Racket)వెలుగులోకి వచ్చింది. నీట్ పరీక్షలో విజయం సాధించేందుకు అసలైన అభ్యర్థుల స్థానంలో నకిలీ వ్యక్తులతో ఓ ముఠా పరీక్ష (NEET Exam) రాయిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ మోసం బయటపడింది. ఏకంగా ఎయిమ్స్ (Delhi AIIMS) విద్యార్థులే ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ లో నీట్ రాకెట్ ను నడిపిస్తున్న వ్యక్తితో సహా మరో నలుగురు విద్యార్థులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ ఎయిమ్స్‌లో రేడియాలజీ డిపార్ట్ మెంట్ లో రెండో సంవత్సరం చదువుతున్న నరేశ్ బిష్రోయ్ ఈ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. నీట్ పరీక్షలో విద్యార్థుల స్థానంలో నకిలీ అభ్యర్థులను ఏర్పాటు చేయించి నరేశ్ వారితో పరీక్ష (NEET Exam) రాయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. సమర్థులైన విద్యార్థులకు డబ్బులు ఆశ చూపి తన గ్యాంగ్‌లో చేర్చుకునేవాడు. ఎక్కువగా ఎయిమ్స్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో నీట్ పరీక్ష రాయించేవాడు. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన నీట్ ప్రవేశ పరీక్షలో నరేశ్ పంపించిన పలువురు విద్యార్థులు, ఒరిజినల్ అభ్యర్థుల స్థానంలో పరీక్ష రాస్తూ అధికారులకు దొరికారు. ఎయిమ్స్‌లో రేడియాలజీ ప్రథమ సంవత్సరం చదువుతున్న సంజూ యాదవ్ అనే విద్యార్థి, వేరే అభ్యర్థి స్థానంలో నీట్ పరీక్ష రాస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. అలాగే, మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో గల ఓ నీట్ పరీక్షా కేంద్రంలో మరో ఇద్దరు విద్యార్థులు మహవీర్, జితేంద్ర కూడా ఇలాగే పట్టుబడ్డారు. కూపీ లాగితే డొంకంతా కదిలినట్టు పట్టుబడ్డ విద్యార్థులను విచారించగా ఈ నీట్ రాకెట్ గుట్టు రట్టుయ్యింది.
వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు ఈ మొత్తం వ్యవహాారాని మూల కారకుడైన నరేశ్ బిష్రోయ్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ విద్యార్థులతో ప్రవేశ పరీక్ష రాయించేందుకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.7లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముందుగా రూ. 1 లక్ష అడ్వాన్స్ తీసుకుని, పరీక్ష రాసిన తర్వాత మిగితా రూ.6లక్షలు చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ గ్యాంగ్ లో ఇంకా ఎంతమంది విద్యార్థులు ఉన్నారన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.