బీహార్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఘోర అగ్నిప్రమాదం(Fire Accident)లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బాలికలు సజీవ దహనం అయ్యారు. బీహార్ లోని ముజఫర్పుర్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అగ్నిప్రమాదంలో ఇంట్లోని సామాగ్రి మొత్తం కాలి బూడిదైపోయాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జిల్లాలోని రామ్దయాళ్ ప్రాంతంలో నివశించే ఓ కుటుంబానికి చెందిన ఇంట్లో అర్ధరాత్రి 1.30 గంటలకు ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోకి అకస్మాత్తుగా మంటలు(Fire Accident) చెలరేగడంతో ఆ ఇంటికి పక్కనే ఉన్న మరో మూడు ఇల్లు దగ్ధమయ్యాయి. ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు బాలికలు మంటల్లో చిక్కుకుని మృతి చెందారు.
ఈ అగ్ని ప్రమాదం(Fire Accident)లో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. చికిత్స కోసం ఆ ఆరుగురిని ఎస్కేఎంసీహెచ్ ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వారిని సోని(12), శివాని(8), అమృత(5), రీటా(3)గా పోలీసులు గుర్తించారు. నివాస స్థలానికి కాస్త దూరంలో ఉన్న రాజేష్రామ్, ముఖేష్రామ్ల ఇళ్లకు కూడా మంటలు వ్యాపించడంతో ఆరుగురికి గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు.