»Firing At Salman Khans Mumbai Home By Lawrence Bishnoi Gang Sources
Salman Khan : సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు.. వారి పనే
ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులు ఎవరు జరిపి ఉంటారన్న దానిపై పోలీసులు ఏమంటున్నారంటే..?
Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర ఆదివారం ఉదయం 4:51 గంటల సమయంలో కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్(Lawrence Bishnoi Gang) పని అని తాజాగా పోలీసులు వెల్లడించారు.
ముంబయిలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి దగ్గర ఆదివారం తెల్లవారు జామున దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ కాల్పులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు గుర్తించారు. వారు లారెన్స్ గ్యాంగ్‌కు చెందిన వారని తెలిపారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. అనంతరం గెలాక్సీ అపార్టుమెంట్స్ బయట నాలుగు రౌండ్లు కాల్చారు. సమాచారం అందుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరిపిన వ్యక్తుల కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఇందులో భాగంగా అపార్ట్మెంట్స్ వద్ద సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి వాటి ఆధారంగా ఇద్దరు నిందితుల్ని తాజాగా గుర్తించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
వారిద్దరూ హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన వారని పోలీసులు అన్నారు. నిందితుల్లో విశాల్ అనే వ్యక్తిపై గతంలో హింసాత్మక నేరాలకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. విశాల్‌కు లారెన్స్ గ్యాంగ్ సభ్యుడు రోహిత్ గోదారాతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది మార్చిలో గురుగ్రామ్‌లోని ఓ వ్యాపారవేత్త హత్య కేసులో విశాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సల్మాన్ కృష్ణ జింకను వేటాడి తమ మనోభావాలను దెబ్బతీశాడని అతడిపై ప్రతీకారం తీర్చుకుంటామని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) బెదిరించాడు. దీంతో సల్మాన్‌కు వై ప్లస్ కేటగిరీ భద్రతను పోలీసులు కల్పిస్తున్నారు. తాజా ఘటనతో ఆయనకు భద్రతను మరింత పెంచారు.