ఘోర రోడ్డు బస్సు ప్రమాదంలో 16 మంది దుర్మరణం చెందిన సంఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. దక్షిణ మెక్సికోలో జరిగిన ప్రమాదంలో మరో 29 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటనలో వెనిజులా, హైతీ ప్రాంతాలకు చెందిన 16 మంది వలసదారులు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మెక్సికోలోని నేషనల్ ఇమ్మిగ్రేషన్ ఇన్స్టిట్యూట్ ఈ ప్రమాదంలో 18 మంది మరణించినట్లు తెలిపింది. ఆ తర్వాత మరణాల సంఖ్యను తగ్గిస్తూ ప్రకటన చేసింది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారని, 29 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఓక్సాకాలో హైవే మలుపు వద్ద బస్సు బోల్తా పడగా ఆ ప్రాంతం మొత్తం భయానకంగా మారింది. వెనిజులా నుండి వచ్చిన మొత్తం 55 మంది వలసదారులు వాహనంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
గత వారం కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో పొరుగు రాష్ట్రమైన చియాపాస్లోని హైవేపై సరుకు రవాణా ట్రక్ ప్రమాదానికి గురవడంతో 10 మంది క్యూబా వలసదారులు దుర్మరణం చెందారు. గత వారం చియాపాస్లోని హైవేపై ట్రక్కు పల్టీలు కొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో 27 మంది గాయపడ్డారు.