ఒక ఏరియాలో కారును దొంగలిస్తారు. దాని ఛాసిస్ నెంబర్‌తో సహా చాలా మార్పులు చేసి వేరే ఏరియాలో తక్కువ ధరకే అమ్మేస్తారు. పోలీసుల కళ్లుకప్పి కోట్ల రూపాయలు దోచుకుంటున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Cars are stolen. It is sold at a low price in different areas. Hyderabad police caught the gang.
Police: మాములుగా మార్కెట్ ప్రైజ్ కన్నా తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ బైక్‌లు(Bikes), కార్లు(Car) కొన్నామని మన చుట్టు పక్కల వాళ్లు అప్పుడప్పుడు చెబుతుంటారు. అది విని ఆశ్చర్యపోతాం. ఈ మోడల్ కారు సెకండ్స్లో ఇంత తక్కువకు ఎలా వచ్చిందని. మాములుగా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే చౌకగా అమ్మేస్తారు. కానీ మరి అంత తక్కువకు ఎవరు అమ్మరని మనకు తెలుసు. అయినా సరే తక్కువకే విక్రయిస్తున్నారంటే.. అది కచ్చితంగా ఇలాంటి కేసుకు సంబంధించినదే అయి ఉంటుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. చోరీ చేసిన కారును తక్కువ ధరకు అమ్ముతూ కొందరు వ్యక్తులు హైదరాబాద్(Hyderabad) పోలీసులకు పట్టుబడ్డారు. వారిని విచారించగా విస్తూ పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఒకరు ఢిల్లీ(Delhi), మహారాష్ట్ర(Maharashtra)లల్లో కారును కొట్టేస్తారు. మరొకరు కలకత్తా తీసుకెళ్లి దాని ఛాసిస్ నెంబర్ మార్చేస్తారు. ఇంకోరు దాన్ని తెలంగాణ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్లు సృష్టిస్తారు. మరొకరు కారుకు కొత్త సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, దానికి సరిపోయే తాళాలు తయారు చేయిస్తాడు. ఇంకో వ్యక్తి ఆ వాహనాన్ని రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తీసుకొస్తాడు. ఆ తర్వాత ముఠా సభ్యులు వివిధ రాష్ట్రాల్లో తక్కువ ధరకే అమ్మేస్తారు. ఈ అంతర్రాష్ట్ర ముఠాలోని ఏడుగుర్ని రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
ముఠా నాయకుడైన కోల్‌కతాకు చెందిన బప్పా ఘోష్ దిల్లీ, హరియాణా, మహారాష్ట్రలో ఇటీవల కొట్టేసిన 11 కార్లకు ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్ నంబర్లు వేయించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌కు చెందిన ఆకాశ్ సూద్, అక్షయ్, ఆశీష్ సూద్, సమీర్ అహ్మద్, కోల్‌కతాకు చెందిన ఆశాబుల్ మోండల్ ద్వారా హైదరాబాద్‌కు తరలించాడు. వీటిని ఇక్కడ విక్రయించేందుకు డీలర్లు కడియం శ్రీనివాసరావు(నిజాంపేట), మక్కీ ఉర్ రెహ్మాన్(మైలార్‌దేవ్‌పల్లి)లను సంప్రదించారు. శ్రీనివాసరావు ఏడు, రెహ్మాన్ నాలుగు కార్లు అమ్మారు. ఈ ఏడుగురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బప్పా ఘోష్ సహా మరో 8 మంది పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.3.3 కోట్ల విలువైన 11 కార్లను స్వాధీనం చేసుకున్నారు.