»Biscuit That Defamed The Company He Got One Lakh Saying That It Was Less Than One
Biscuit Missing: కంపెనీ పరువు తీసిన బిస్కెట్..ఆ ఒక్కటీ తక్కువైందని చెప్పి రూ.లక్ష కొట్టేశాడు!
ఓ బిస్కెట్ ప్యాకెట్లో ఒకటి తక్కువైంది. ఆ బిస్కెట్ తక్కువవ్వడంతో ఆ ప్యాకెట్ కొన్న వ్యక్తి కోర్టుకెళ్లాడు. ఈ కేసును విచారించిన కోర్టు ప్రతి రోజూ రూ.30 లక్షల వరకూ మోసం జరుగుతోందని గుర్తించింది. ఈ కేసులో కీలక తీర్పునిచ్చింది. ఆ మోసాన్ని బయటపెట్టిన వ్యక్తికి పరిహారం కూడా ఇప్పించింది.
ఓ బిస్కెట్ ప్యాకెట్లో (Biscuit Packet) ఒకటి తక్కువైందని లక్ష రూపాయల పరిహారాన్ని పొందాడు. ఈ ఘటన చెన్నై (Chennai)లో చోటుచేసుకుంది. నగరానికి చెందిన డిల్లి బాబుకు వీధి కుక్కలకు బిస్కెట్లు తినిపించే అలవాటు ఉంది. ఓ రోజు ఐటీసీ కంపెనీకి చెందిన సన్ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్ ప్యాకెట్ కొని వీధి కుక్కలకు వేయాలనుకున్నాడు. ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి చూడగానే అందులో ఓ బిస్కెట్ తక్కువగా ఉంది. వెంటనే దుకాణం వద్దకు వెళ్లి వివరాలు అడగ్గా దుకాణం యజమాని నుంచి సరైన సమాధారం రాలేదు.
దీంతో డిల్లి బాబు (Dilli babu) వినియోగదారుల కోర్టు (Consumer Court)ను ఆశ్రయించాడు. ఆ కోర్టు నుంచి తనకు కావాల్సిన సమాచారాన్ని సేకరించాడు. ఐటీసీ కంపెనీ (ITC Company) ద్వారా ప్రతి రోజూ రూ.30 లక్షల వరకూ మోసం జరుగుతోందని తెలుసుకుని కోర్టుకు విన్నవించుకున్నాడు.
సాధారణంగా మేరీ లైట్ బిస్కెట్ ప్యాకెట్ లోని ఒక్కొక్క బిస్కెట్ ధర 75 పైసలు పడుతుంది. ఐటీసీ కంపెనీ రోజూ 50 లక్షల బిస్కెట్ ప్యాకెట్లను తయారు చేస్తుంటుంది. అలా ఒక్కో బిస్కెట్ ధరతో అన్ని ప్యాకెట్లను కలిపి చూస్తే సుమారుగా రూ.30 లక్షల వరకూ మోసం జరుగుతోందని డిల్లిబాబు కోర్టుకు తెలిపాడు. ఆ బిస్కెట్లలో కూడా ఒక్కో బిస్కెట్ బరువు కేవలం 74 గ్రాములే ఉందని, వాటికి సంబంధించిన వివరాలను కోర్టుకు అందించాడు.
ఈ కేసులో వాదనలు విన్న కోర్టు ఆగస్టు 29వ తేదిన తీర్పునిచ్చింది. ఐటీసీ కంపెనీ (ITC Company) అక్రమ వ్యాపారానికి పాల్పడిందని తేల్చింది. బరువు తక్కువగా ఉండే బిస్కెట్ల అమ్మకాలు వెంటనే ఆపాలని ఆదేశాలిచ్చింది. దాంతో పాటుగా ఈ మోసాన్ని వెలికితీసిన డిల్లిబాబు (Dilli babu) కు రూ.1 లక్ష రూపాయల పరిహారాన్ని కూడా ఇవ్వాలని ఆ ఐటీసీ కంపెనీని ఆదేశించింది.