»Cancer Cases Are Increasing Among Young People High Among Them
Cancer Rate: యువతలో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు..వారిలోనే అధికం!
క్యాన్సర్ కేసులు యువతలో అత్యధికంగా పెరిగాయని షాకింగ్ నివేదిక బయటపడింది. ఈ నివేదిక ఆధారంగా.. 50 ఏళ్ల వయసు కంటే తక్కువగా ఉన్నవారిలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయని తేలింది.
క్యాన్సర్ కేసులు (Cancer cases) ఎక్కువవుతున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. 50 ఏళ్లకంటే తక్కువ వయస్సున్న వారిలోనే ఈ కేసులు పెరిగాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా యువతలో అత్యధిక సంఖ్యలో క్యాన్సర్ కేసులు పెరిగాయని ఆ అధ్యయనం తెలిపింది. పెద్ద పేగు క్యాన్సర్తో పాటుగా జీర్ణాశయాంతర క్యాన్సర్లు అన్ని రకాల క్యాన్సర్ల కంటే 14.08 శాతం ఎక్కువగా పెరుగుతున్నట్లు నిపుణులు వెల్లడించారు.
ఈ వ్యాధి పెరుగుదలపై 2010 నుంచి 2019 వరకూ 50 వేలకు పైగా క్యాన్సర్ కేసులను (Cancer Cases) నిపుణులు పరిశీలించారు. వారిలో 50 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న రోగులపై దృష్టి సారించారు. ఆ వయసు కంటే తక్కువ ఉన్న వారిలో క్యాన్సర్ రేటు అత్యధికంగా పెరిగిందని వైద్యులు గుర్తించారు. అది సంవత్సరానికి సగటున 0.28 శాతం పెరిగిందని, అపెండిక్స్ క్యాన్సర్ రేటు (Cancer Rate) కూడా బాగా పెరిగినట్లు వైద్యులు స్పష్టం చేశారు.
పిత్త వాహిక క్యాన్సర్లు 142 శాతం పెరిగాయని, గర్భాశయ క్యాన్సర్లు 76 శాతం పెరిగాయని, అపెండిక్స్ క్యాన్సర్ కేసులు 252 శాతం పెరిగాయని ఆ అధ్యయనంలో వైద్య నిపుణులు గుర్తించారు. మహిళల్లో సగటున 4.4 శాతం, పురుషుల్లో 4.91 శాతం క్యాన్సర్ రేటు పెరిగిందని, ముప్పై ఏళ్ల వారిలో ఈ రేటు (Cancer Rate) అత్యధికంగా పెరిగినట్లు వైద్యులు కనుగొన్నారు.