»Arrest Warrant For 83 Year Old Man In Buffalo Death Case
Uttar Pradesh: గేదె చనిపోయిన కేసులో 83 ఏళ్ల వ్యక్తికి అరెస్ట్ వారెంట్
ఓ వ్యక్తి 28 ఏళ్ల క్రితం బస్సు నడుపుతుండగా గేదెను ఢీకొన్నాడు. అప్పట్లో గేదె మరణించిన విషయంలో అతనిపై కేసు నమోదైంది. ఆ వ్యక్తికి ఇప్పుడు 83 ఏళ్లు. పోలీసులు ఇప్పుడు ఆ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
83 ఏళ్ల వ్యక్తిపై గేదె(Buffalo) చనిపోయిన కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. పక్షవాతంతో బాధపడుతూ ఇంట్లోనే ఉన్న ఆ వృద్ధుడిని పోలీసులు(Police) అరెస్ట్ చేసి తీసుకెళ్లడంతో బోరున విలపించాడు. ఈ తాజా ఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో చోటుచేసుకుంది. సరిగ్గా 28 ఏళ్ల క్రితం ఆ వృద్ధుడి వాహనం బర్రెను ఢీకొంది. ఆ కేసు ఇన్ని రోజులకు బెంచ్‌మీదకు రావడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని బారాబంకీలోని దయానంద్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ వెనుక మునవ్వర్ నివశించేవాడు. ఆయన కైసర్‌బాగ్ డిపోలో డ్రైవర్ గా పనిచేసేవాడు. ఆ తర్వాత చార్ బాగ్, బారాబంకి డిపోలల్లో కూడా డ్రైవర్‌గా పనిచేసేవాడు. 1994లో ఆయన బస్సులో లక్నో నుంచి బయల్దేరగా ప్రయాణంలో బస్సు ముందుకు గేదె దూసుకొచ్చింది. దీంతో ఆ బర్రెను బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఆ బర్రె మరణించింది. ఈ విషయంపై అప్పట్లో ఫరీద్ పూర్ పీఎస్‌లో కేసు నమోదైంది.
అప్పటి నుంచి ఉన్న ఆ కేసు అతను ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసినా కొనసాగుతూనే ఉంది. నిన్న హఠాత్తుగా ఎస్ఐ విజయ్‌పాల్(SI Vijaypaul), పోలీసులు వచ్చి ఆ వృద్ధుడిని అరెస్ట్ చేశారు. పక్షవాతంతో బాధపడుతున్నా అని చెప్పినా వినిపించుకోలేదు. బలవంతంగా అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లారు. స్థానికంగా ఈ కేసు కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును కోర్టు ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఈ కేసు తీర్పును కోర్టు ప్రకటించనున్నట్లు పోలీసులు తెలిపారు.