NRPT: గుండుమల్ మండలంలోని కొమ్మూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి స్వయం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు. ఉత్తమంగా విద్యాబోధన చేసిన విద్యార్థులకు గ్రామ సర్పంచ్ వనజ గంగాధర్ గౌడ్ బహుమతులను అందజేశారు.
NZB: నవీపేట్ మండల కేంద్రంలోని టీజీఎంఎస్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పరీక్షలు మూడో రోజు ప్రశాంతంగా నిర్వహించారు. జనరల్ విభాగంలో 189 మందిలో 187 మంది హాజరై, ఇద్దరు గైర్హాజరయ్యారు. వోకేషనల్ విభాగంలో 31 మంది విద్యార్థులకు 31 మంది హాజరయ్యారు. మొత్తం 218 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా సమాచార హక్కు చట్టం RTI ACT-2005 జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాసం అనిల్ కుమార్ రెండో సారి నియమితులయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమలాకర్, జిల్లా అధ్యక్షుడు వర్ని సంతోష్ అధ్యక్షతన శుక్రవారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. దీంతో నిరంతరం ప్రజల హక్కుల సాధన కోసం పోరాటం చేస్తూ రెండో సారి పదవి దక్కించుకున్న అనిల్‌ను పలువురు అభినందించారు.
JN: పాలకుర్తిలో తెలంగాణ రైతు సంఘం మూడవ మహాసభలను నిర్వహించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగారెడ్డి హాజరై మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, రైతు సంక్షేమానికి ప్రభుత్వాలు పెద్దపీట వేస్తూ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.
NGKL: అచ్చంపేట నియోజకవర్గంలోని 137 గ్రామ పంచాయతీల సర్పంచులకు జిల్లా కేంద్రంలో శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఎన్నుకున్నారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలన్నారు.
గద్వాల జిల్లా కేంద్రంలోని పీజేపీ క్యాంప్ ఆమినా మస్జిద్లో శుక్రవారం జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా మసీదుకు వచ్చిన ఆయన వీఐపీ ప్రోటోకాల్ లేకుండా సాధారణ భక్తులతో కలిసి ఒకే వరుసలో నిలబడి నమాజ్ చేశారు. కలెక్టర్ నిరాడంబరతను స్థానికులు అభినందించారు. భక్తి ముందు అందరూ సమానమని ఆయన సందేశం ఇచ్చారు.
WNP: ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ వాడ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం సర్పంచ్ సూచనలతో టాయిలెట్స్ నిర్మాణ పనులకు ముగ్గు పోసి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల ఆరోగ్యం పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని ఆయన అన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలకు, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారా పాఠశాల వాతావరణం మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
JGL: ప్రతి వాహనదారుడు ఇంట్లో నుంచి బయటికి వాహనంపై వెళ్తున్నారంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలు కాపాడుకోవాలని ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం పెగడపల్లి మండలం అయితుపల్లిలో రోడ్డు భద్రతపై ఎస్సై అవగాహన కల్పించారు. వాహనాలు నడిపేటప్పుడు, ప్రజలు రోడ్లపై నడిచేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని అన్నారు.
MBNR: రాజపూర్ మండలంలోని తిరుమలాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శుక్రవారం ’స్వయం పరిపాలన’ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధికారులుగా బాధ్యతలు చేపట్టి పాఠాలు బోధించి మెప్పించారు. ఎంఈవో సుధాకర్ మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ఈ వేడుకలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
SRD: కంగ్టి(మం) సుక్కలతీర్థ్ గ్రామాన్ని AEO సంతోష్ కుమార్ శుక్రవారం సందర్శించారు. ఈ మేరకు స్థానిక శివారులో రైతులు సాగు చేస్తున్న యాసంగి జొన్న పంట క్షేత్రంలో పంటను పరిశీలించారు. ఇటీవల కురిసిన అకాల వర్షం, గాలులకు ఏపుగా పెరిగిన జొన్న పంట కొంత నేలకొరిగింది. అయితే నాలుగైదు మొక్కపైర్లకు ఒకచోట కట్టితే జొన్న పంట కాపాడుకోవచ్చని సూచించారు.
VKB: పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ DMHO రవీందర్ యాదవ్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రికార్డులను, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి అక్కడున్న రోగులతో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని? అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మౌలిక సదుపాయాలు అందిస్తున్నారా లేదా? అంటూ కలియతిరిగి పరిశీలించారు.
SRPT: హుజూర్నగర్లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం దొడ్డ వెంకటయ్య అధ్యక్షతన జరిగింది. గత కార్యక్రమాల సమీక్షతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ మాట్లాడుతూ.. మార్చి 9న కార్మిక, రైతు పార్లమెంట్, మార్చి 10 నుంచి ఏప్రిల్ 13 వరకు దేశవ్యాప్తంగా మహాపంచాయత్‌లు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
SRPT: తెలంగాణ సాయుధ పోరాట యోధులు, స్వాతంత్ర సమరయోధులు, కామ్రేడ్ చిల్లంచర్ల రఘునాథం సతీమణి చిల్లంచర్ల వరలక్ష్మి మృతి అత్యంత బాధాకరమని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందిన ఆమె పార్థివ దేహాన్ని ఆయన సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుబటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
SRPT: మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎస్సై మోహన్ బాబు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నామని చెప్పారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం నేరమని, ప్రమాదాలు జరిగితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
WGL: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను ఎంపీ కడియం కావ్య పరిశీలించారు. ఉత్తర తెలంగాణకు తలమానికంగా నిలిచే ఈ ఆసుపత్రి ద్వారా వరంగల్‌తో పాటు పలు జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే ఓపీ, ఐపీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు.