BHPL: కాలేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో మార్చి 3న చంద్రగ్రహణం సందర్భంగా ద్వారబంధనం చేయనున్నట్లు ఆలయ EO మహేష్ తెలిపారు. ఉదయం 6:30 గంటల నుంచి ఆలయం మూసివేసి, గ్రహణానంతరం మార్చి 4న సంప్రోక్షణ పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. గ్రహణ సమయంలో ఎలాంటి పూజలు ఉండవని, భక్తులు గమనించాలని EO కోరారు.
WGL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్‌తో శనివారం సాయంత్రం MGNREGS పనులపై కలెక్టర్ డా, సత్య శారద సమీక్ష నిర్వహించారు. పనుల విధానం, కార్మికుల చెల్లింపులు మాస్టర్ రోల్స్ నిర్వహణ నాణ్యత పనులపై అధికారులతో చర్చించి పనులు త్వరగా పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. ఆడిట్ నివేదిక త్వరగా దించాలని అధికారులను కోరారు.
SDPT: బెజ్జంకిలో విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా శనివారం ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఎమ్మార్వో కార్యాలయం పరిసరాలు, కాలేజీ ప్రాంతం, పెట్రోల్ బంక్ మార్గం అలాగే ఎల్లంపల్లి వరకు ఈ పవర్ కట్ అమల్లో ఉంటుంది. వినియోగదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుని శాఖకు సహకరించాలని కోరారు.
NZB: మార్చి 15 లోపు IKP ద్వారా అందించిన రుణాలను 98% రికవరీ చేయాలని వివోఏలను, సీసీలకు ఏపీడి మధుసూదన్ ఆదేశించారు. శనివారం సాయంత్రం రెంజల్ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో సీసీలకు, వివోఏలకు రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహార మిషనరీలకు సంబంధించిన 20 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారికి 35% సబ్సిడీ కింద రుణాలను అందజేయనున్నట్లు తెలిపారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ ఆస్తి పన్నులు చెల్లించని మొండి బకాయి దారులకు నోటీసులు జారీ చేసి, మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. నగరపాలక సంస్థ ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నుల వసూళ్లలో భాగంగా పలు డివిజన్లలో పర్యటించారు. రేకుర్తి, కాపువాడ, రాంనగర్, కోతి రాంపూర్, అల్గునూర్‌లలో ఆస్తి పన్నుల వసూళ్లను పరిశీలించారు.
SRD: జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులకు ఈ నెల 2 నుంచి 10వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు అదివారం తెలిపారు. మార్చి 2న తెలుగు, 4న హిందీ, 5న ఇంగ్లిష్, 6న గణితం, 7న ఫిజికల్ సైన్స్, 9న జీవశాస్త్రం, 10న సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలన్నారు.
HYD: నగరంలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 257 నుంచి రూ. 260 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 292 నుంచి రూ. 300 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 20 వరకు పెరిగిందని విక్రయదారులు తెలిపారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం మాంసం ధరలు చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. కేజీ స్కిన్లెస్స్ చికెన్ ధర రూ. 260 నుంచి 280 పలకగా.. కేజీ స్కిన్ చికెన్ ధర రూ. 240 నుంచి 250 మధ్య పలుకుతుంది. అలాగే కేజీ గొర్రె మాంసం ధర రూ. 700 నుంచి 800 మధ్య పలుకగా.. కేజీ మేక మాంసం ధర రూ.750 నుంచి 850 వరకు పలుకుతున్నట్లు మాంసం విక్రయదారులు తెలిపారు.
VKB: అనంతసాగర్‌లో ఓ ఇంట్లో తుపాకీ బయటపడిన ఘటన కలకలం రేపింది. అకస్మాత్తుగా గ్రామంలో తనిఖీలు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ అధికారులు సంబంధిత ఇంటిని పరిశీలించగా, ఎలాంటి లైసెన్స్ లేని తుపాకీ లభ్యమైనట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది. స్వాధీనం చేసుకున్న ఆయుధంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
JGL: పెగడపల్లిలోని స్వయంభు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శనివారం జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నిఖిషా ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆమెకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరుణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
NGKL: బిజినపల్లి మండలం వట్టెంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచి వైభవంగా జరగనున్నాయి. ఈరోజు ఎదుర్కోలు, స్వామి వారి గరుడ సేవ, సోమవారం స్వామివారి కల్యాణోత్సవం, మంగళవారం రాత్రి రథోత్సవం నిర్వహించనున్నారు. గురువారం చక్రతీర్థం, మర్చి 6 నుంచి 13 వరకు స్వామివారికి నిత్య పూజలు జరగనున్నాయి.
MHBD: తొర్రూరు మండలంలోని పత్తేపురం గ్రామంలో శనివారం రాత్రి ఎస్సై శివరామకృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందంచే మూఢనమ్మకాలపై అవగాహన నిర్వహించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు చెప్పకూడదని తెలిపారు. రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.
HYD: కోకాపేటలోని శారదా పీఠం భూములపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జలమండలికి చేసిన కేటాయింపులను రద్దు చేస్తూ, ఆ భూములను పీఠానికే కొనసాగించాలని ఆదేశించారు. నిర్మాణాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వని అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలతో మంత్రి శ్రీధర్ బాబును కలవాలని పీఠం ప్రతినిధులకు సూచిస్తూ తుది ఉత్తర్వులు జారీ చేశారు.
MNCL: స్కిల్ ఇండియా పోటీల్లో మంచిర్యాల జిల్లా విద్యార్థి ఎర్రం శ్రీరామ్ ప్రతిభ చాటారు. హైదరాబాద్‌లో జరిగిన దేశవ్యాప్త స్కిల్ డెవలప్మెంట్‌కు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ తరపున వడ్రంగి రంగంలో ప్రాతినిధ్యం వహించిన శ్రీరామ్ ప్రథమ స్థానంలో విజయం సాధించారు. రాష్ట్ర మంత్రి వివేక్ ప్రశంస పత్రంతో శ్రీరామ్‌ను సత్కరించారు.
MDK: పట్టణంలోని పిట్లంబేస్ వీధిలో ఈ నెల 9న మహ్మద్ ఇమ్రాన్ కుటుంబంపై దాడికి యత్నించి, భయబ్రాంతులకు గురిచేసిన కేసులో మల్లికార్జున్ గౌడ్ సహా మరికొందరిని శనివారం అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ మహేశ్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకే ఈచర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ అరెస్టులు కేవలం సదరు దాడి కేసు విచారణ కోసమేనని, ఎమ్మెల్యేపై దాడికి సంబంధం లేదని తెలిపారు.