KNR: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా సైదాపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ శ్రీనివాస్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. మహిళలకు రూ. 2500, రూ. 500కే గ్యాస్, రూ. 4వేల పెన్షన్, యువ వికాసం అమలు చేయకుండా సీఎం రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందని మండల అధ్యక్షుడు దెంచనాల శ్రీనివాస్ మండిపడ్డారు. రైతులను దగా చేశారని, వెంటనే హామీలు అమలు చేయాలని కోరారు.
SDPT: చిన్నకోడూరు మండలంలోని పలు పాఠశాలల్లో బుధవారం ముందస్తుగా ఉగాది సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలను మామిడి ఆకుల తోరణాలతో అందంగా అలంకరించారు. విద్యార్థుల సమక్షంలో షడ్రుచులతో కూడిన పచ్చడిని తయారు చేసి అందరికీ పంపిణీ చేశారు. తెలుగు సంవత్సరాది ఆవశ్యకత, పచ్చడి వల్ల కలిగే లాభాలను విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు.
SRCL: కోర్టు ఆస్తి దొంగతనం కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ గురువారం తీర్పు వెలువరించారని సిరిసిల్ల సీఐ శ్రీనివాస్ తెలిపారు. సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 10, 2025న కోర్టు ప్రాంగణంలోని ఎయిర్ కండిషనర్ అవుట్ డోర్ యొక్క రాగి వైరును బహదూర్ సింగ్ దొంగలించాడన్నారు.
WGL: పట్టణ కేంద్రంలోని LB నగర్ క్రిస్టల్ గార్డెన్‌లో బుధవారం సాయంత్రం కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో ‘ఈద్ కా తోఫా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ డా. సత్య శారద పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. పండుగలను సోదరభావంతో, ఐక్యతతో జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
MBNR: మహబూబ్‌నగర్ పట్టణంలోని 31వ, 32వ డివిజన్ల పరిధిలో ఉన్న ఎర్రకుంట చెరువును డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ రామాంజుల రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువును పునరుద్ధరించి, చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.
HYD: హెచ్.ఎల్.ఏలో వెల్ఫేర్ ఫండ్ మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ‘పరాభవ’ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఈ.డీ రామ్మోహనరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ ఏడాది కూడా పరిశ్రమ అభివృద్ధికి ఉద్యోగులందరూ ఐకమత్యంతో కృషి చేయాలని ఆయన కోరారు. ఈ వేడుకల్లో జనరల్ మేనేజర్ సతీష్, కర్కా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
NGKL: రేపు ఉగాది పర్వదినం సందర్భంగా అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి తిరుపతి పుణ్య క్షేత్రానికి బయలుదేరే ఆర్టీసీ బస్సును రద్దు చేసినట్లు అచ్చంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసాద్ తెలిపారు. అదేవిధంగా ఈ నెల 20న తిరుపతి నుంచి అచ్చంపేటకు వచ్చే బస్సును రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు గమనించాలని ఆయన కోరారు.
SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలో రేపు గురువారం భారీ కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్థానిక సర్పంచ్ శ్రీనివాసరావు పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఈసారి కూడా బస్తీమే సవాల్ పోటీలు జరుగుతాయన్నారు. చుట్టుపక్క ప్రాంతాల నుంచి మల్ల యోధులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. విజేతలకు బహుమతులు ఇస్తామన్నారు.
KMR: వరల్డ్ తెలుగు ఐటి అసోసియేషన్ (WTIT) ఆధ్వర్యంలో ఈనెల 28, 29 తేదీల్లో HYD గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ హ్యాకథాన్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు జిల్లాలోని క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. ఆసక్తి గలవారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని, లేదంటే 97365 60909 సంప్రదించాలని పేర్కొన్నారు.
GDWL: అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు గురికాకుండా చాకచక్యంగా వ్యవహరించాలి అని జిల్లా ఫైర్ ఆఫీసర్ అశోక్ ఓ ప్రకటనలో సూచించారు. బుధవారం గద్వాలలో ఓ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు.
NLG: ఉగాది, రంజాన్ పండుగలతో వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో జనం సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి నల్గొండ వైపు వచ్చే బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. గురువారం ఉగాది, శనివారం రంజాన్ కావడంతో మధ్యలో శుక్రవారం సెలవు తీసుకుని ఊర్లకు వెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి.
PDPL: పర్యావరణన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, HDK యూనివర్సిటీ అసిస్టెంట్ సైంటిస్ట్ కనక జ్యోతి సూచించారు. గోదావరిఖని HDK యూనివర్సిటీ PG కాలేజ్ ఆవరణలో ప్లాస్టిక్ నిషేధంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ సైంటిస్ట్ కనక జ్యోతి పాల్గొని ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే హానికర ప్రభావాలను వివరించారు.
KMM: రైతాంగ సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట అధ్యక్షులు బాగం హేమంతరావు ఆరోపించారు. రైతులకు ఇచ్చిన ఏ హామీని ఈ ప్రభుత్వం అమలు చేయలేదని తెలిపారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ ధోరణి మారకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
MDK: రామాయంపేట మండలం రాయిలాపూర్ శివారులో పాడి గేదెను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంగా వచ్చిన ఒక ద్విచక్ర వాహనం ఎదురుగా పాడి గేదేను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పాడి గేదె అక్కడికక్కడే మృతి చెందింది. ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
WGL: భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని “బ్యాండ్ మేళం” చిత్ర యూనిట్ సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన చిత్ర యూనిట్‌కు స్థానిక ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బ్యాండ్ మేళం చిత్రాన్ని ప్రజలు ఆదరించాలని చిత్ర యూనిట్ సభ్యులు కోరారు.