NDL: కొలిమిగుండ్ల మండలంలోని అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన జూటూరు పుష్పావతి(40) కుటుంబ వివాదాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు. బుధవారం రాత్రి 11 గంటలకు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, కుటుంబ సభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. గురువారం మృతి చెందినట్లు సీఐ వెల్లడించారు.
AKP: మునగపాక మండలం గణపర్తి జడ్పీ హైస్కూల్లో ఏపీ ఎన్.డీ.ఆర్.ఎఫ్. 16వ బెటాలియన్ ఆధ్వర్యంలో విపత్తుల నుంచి రక్షణ కోసం గురువారం మాక్ డ్రిల్ నిర్వహించారు. వరదలు, అగ్నిప్రమాదాలు, అపార్ట్మెంట్స్‌లో ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా బయటపడాలో విద్యార్థులకు బెటాలియన్ ఆర్ఎస్ఐ వైకుంఠ రావు సూచించారు.
AP: వాతావరణ మార్పుల ప్రభావంతో వేసవి కాలం రాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి మొదటి వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 6.5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
GNTR: మాజీ మంత్రి అంబటి రాంబాబును గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గురువారం గుంటూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల అంబటి నివాసంపై జరిగిన దాడుల అంశాన్ని వీరిద్దరూ చర్చించారు. పల్నాడు జిల్లాలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై వరుస దాడులు జరుగుతున్నాయని,అంబటి రాంబాబును అరెస్ట్ చేయడం బాధాకరమని కాసు మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
భారత క్రికెటర్ రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రింకూ తండ్రి ఖచంద్ర సింగ్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. యూపీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి.. చికిత్స అందించారు. కానీ, పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు.
MBNR: రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, సంగారెడ్డి మెదక్ మహబూబ్నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
KDP: ప్రొద్దుటూరు మీదుగా బెంగుళూరుకు రైలు నడపాలని సీఎం చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేసినట్లు స్థానిక మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి తెలిపారు. గురువారం అసెంబ్లీ కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశమై వినతి పత్రం ఇచ్చామన్నారు. కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం అవసరం లేకుండానే, నంద్యాల నుంచి ప్రొద్దుటూరు, తాడిపత్రి, ధర్మవరం మీదుగా బెంగుళూరుకు రైలు నడపాలని సీఎంను కోరారు.
VKB: దామర్చేడ్ అంగన్వాడీ కేంద్రంలో ఆయా లేకపోవడంతో చిన్నారుల సంరక్షణ, క్లీనింగ్ బాధ్యత కష్టతరంగా మారింది. కొంతకాలంగా ఆయా పోస్టు ఖాళీగా ఉండటంతో నిర్వహణ భారమంతా టీచర్‌పైనే పడుతోంది. టీచర్ మండల స్థాయి సమావేశాలకు వెళ్లినప్పుడు కేంద్రం మూసి వేసే పరిస్థితి నెలకొంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయిలో ఒక ఆయాను నియమించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
PPM: జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్‌లో గృహ నిర్మాణ పురోగతిపై కీలక సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉగాది పండగ నాటికి మొత్తం 7,187 ఇళ్లను పూర్తి చేయాలన్నారు.
WGL: కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో నిన్న సాయంత్రం దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.సత్య శారద. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పనుల నాణ్యతలో ఎటువంటి రాజీ పడకూడదని, ప్రతి దశలో సాంకేతిక ప్రమాణాలు పాటించాలని కోరారు.
TG: యాదాద్రిలో కన్నులపండువగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 10వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టనున్నారు. రాత్రికి శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో ఆలయానికి భక్తులు తరలిరానున్నారు.
E.G: రాజమండ్రిలోని శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త గొర్రెల సురేశ్, దీపిక దంపతులు పంచామృత అభిషేకంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఆలయాన్ని విద్యుద్దీపాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
NZB: మున్సిపల్ కార్మికుల సీఐజీ గ్రూపులను యథావిధిగా కొనసాగించాలని TUCI, CITU, AITUC కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏజెన్సీ కార్మికులతో కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం. సుధాకర్, ఓమయ్య, ఏ.రమేష్ బాబు పాల్గొన్నారు.
BDK: కొత్తగూడెం కార్పొరేషన్‌లో పాల్వంచ పేరును చేర్చాలంటూ సోషల్ మీడియా వేదికగా ఉద్యమం ఊపందుకుంది. ఇటీవల సుజాతనగర్ లోని 7 గ్రామాల విలీనంతో 60 డివిజన్లుగా కార్పొరేషన్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు కార్పొరేషన్ పేరులో తమ ప్రాంత గుర్తింపు ఉండాలని స్థానికులు కోరుతున్నారు. అయితే, కోర్టు కేసుల వల్ల పాల్వంచ మున్సిపాలిటీకి ఏళ్ల తరబడి ఎన్నికలు జరగలేదు.
KMR: ఉప్పల్వాయి – కామారెడ్డి మధ్య ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద వారం రోజులుగా కొనసాగుతున్న మరమ్మతు పనులు గురువారం రాత్రి పూర్తయ్యాయి. దీంతో మూసివేసిన రైల్వే గేట్‌ను అధికారులు తిరిగి వాహన రాకపోకలకు తెరిచారు. మరమ్మతుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు గేట్ పునఃప్రారంభంతో ఊపిరిపీల్చుకున్నారు.