KMM: ఖమ్మం శివారు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పదేళ్లుగా నివసిస్తున్న 600 పేదల గుడిసెలను జేసీబీలతో కూల్చివేయడాన్ని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. కనికరం లేకుండా పేదలపై బలప్రయోగం చేయడం దుర్మార్గమని, కూల్చివేతలు నిలిపివేసి అర్హులకు తక్షణమే ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
TG: తాను మతమార్పిడులు చేస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. తాను 50 మందితో పోయినట్లు చెబుతున్నారని.. వీడియో చూపిస్తే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. జమ్మికుంట సీఐ, హుజూరాబాద్ డీస్పీతో పాటు కరీంనగర్ ఎస్పీ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. అన్ని ఆధారాలను బయటపెడతానని తెలిపారు.
VSP: మాజీ సీఎం, బీజేపీ కీలక నేత నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి బుధవారం విశాఖ నగరానికి చేరుకున్నారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. బాలరాజేశ్వరరావు, రవీందర్ రెడ్డి, దీపిక రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి సాలువాతో సత్కరించారు. ఆయన రాకతో విమానాశ్రయం ప్రాంగణం నినాదాలతో మార్మోగింది.
TPT: కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ బుధవారం మీడియా ప్రతినిధులకు అక్రెడిటేషన్ కార్డులను అందజేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన జర్నలిజం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరేలా చూడాలన్నారు.
PLD: మాచవరంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. గ్రామాల అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని ఎంపీపీ అంజమ్మ కోరారు. వర్షాలతో ఈ ఏడాది వ్యవసాయం లాభసాటిగా సాగిందని స్పెషల్ ఆఫీసర్ కృష్ణదేవరాయలు తెలిపారు. కుక్కలు, కోతుల బెడదను అరికట్టాలని ఎంపీడీవో విష్ణు చిరంజీవి సూచించారు. అలాగే రూ.1.20కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
JGL: రాయికల్ మండలంలోని భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో IMA ఆధ్వర్యంలో బాలికలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. 115 మంది బాలికలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి అనీమియాతో బాధపడుతున్న 73 మంది బాలికలకు నెలకు సరిపడా మందులు, సానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు హేమంత్, శ్రీనివాసరెడ్డి, అచ్యుత్, సాహితీ, సర్పంచ్ భావన పాల్గొన్నారు.
AKP: కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్లో 6, 7, 8వ తరగతుల విద్యార్థులకు బుధవారం ఫ్రీ ఒకేషనల్ విజిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా మండలంలో గొట్టివాడ గ్రామంలో అటవీ శాఖ నర్సరీని సందర్శించారు. మొక్కల పెంపకంపై వారికి అవగాహన కల్పించారు. అనంతరం రాజుపేటలో పామాయిల్ మొక్కల పెంపకం గురించి వివరించారు. కైలాసపట్నంలో లక్క బొమ్మల తయారీ గురించి తెలుసుకున్నారు.
AP: కలియుగ దైవం వెంకటేశ్వరుడికి కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. సుమారు 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితోనే తయారు చేశారని ఆయన పేర్కొన్నారు. కెమికల్స్‌లో నెయ్యిని కల్తీ చేసి, ఇప్పుడు ఆ నెపం తమపై వేస్తున్నారని మండిపడ్డారు. తప్పులు చేస్తూ హెరిటేజ్ సంస్థపై నిందలు మోపుతున్నారని విమర్శించారు.
MDCL: పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో మల్కాజ్‌గిరి, గౌతంనగర్, ఇందిరానగర్, మౌలాలి, నేరెడ్మెట్ ప్రాంతాల్లోని మసీదులు విద్యుత్ దీపాలతో ముస్తాబయ్యాయి. ఉదయం సేహరీతో ప్రారంభమయ్యే దీక్షలు సాయంత్రం ఇఫ్తార్‌తో ముగుస్తాయి. రాత్రివేళ తరావీహ్ నమాజ్‌లకు భక్తులు భారీగా హాజరవుతున్నారు. జకాత్, ఫిత్రా ద్వారా అవసరమైన వారికి సహాయం అందిస్తున్నారు.
NTR: నందిగామలో డ్రగ్స్ పై అవగాహన సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సినీ హీరో సుమన్ హాజరై డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో 30వ రోజుకు చేరిన ఈ ర్యాలీ జాతరను తలపించింది. డీజే సౌండ్స్‌తో సాగిన ర్యాలీలో పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
SRCL: జిల్లాలో ప్రణాళిక ప్రకారం రోడ్డు భద్రతా చర్యలు అమలుచేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. ముందుగా గత నెలలో నిర్వహించిన రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం సందర్భంగా చర్చించిన అంశాలపై సమీక్ష చేశారు. రవాణా, ఆర్అండ్‌బీ, NH, పోలీస్ శాఖ సంయుక్తంగా చేసిన సర్వే వివరాలపై ఆరా తీశారు. అన్ని పెట్రోల్ బంక్‌లలో కచ్చితంగా నో హెల్మెట్ .. నో పెట్రోల్ అమలు చేయాలన్నారు.
VKB: పరిగిలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర బుధవారం 1.50 కేజీల గంజాయిని పట్టుకుని ఇద్దరు నిందితులు నితీశ్ రఝాక్(22), సూరజ్ కుమార్ (22)ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్ నుంచి గంజాయిని పరిగికి తీసుకువచ్చి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న లేబర్లకు విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.
AP: మార్కాపురంలో ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు రక్షిత మంచినీరు అందిస్తాం. మార్కాపురం జిల్లాను ఒక సవాలుగా తీసుకుంటా. అన్ని పనులు చేస్తా, ప్రతి ఒక్కరి జీవితంలో మార్పులు తెస్తా. నదుల అనుసంధానం కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది. గోదావరి నుంచి 6 వేల TMCలు సముద్రంలోకి వెళ్లాయి. వెలిగొండకు కాల్సింది 53 TMCలే’ అని పేర్కొన్నారు.
NLG: జిల్లాలో పైలెట్ పద్ధతిన ఎంపిక చేసిన గ్రామాలలో గృహ జ్యోతి లబ్ధిదారులకు అమలు చేస్తున్న ‘రూఫ్ టాప్ సోలార్ సిస్టం’ ఏర్పాటు పనులను మార్చి మొదటి వారంలోపు పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. కనగల్‌లో టీఎస్ రెడ్‌కో ఆధ్వర్యంలో గృహజ్యోతి లబ్ధిదారులకు అమలు చేస్తున్న ‘రూఫ్ టాప్ సోలార్ సిస్టం’ పనులను బుధవారం కలెక్టర్ పరిశీలించారు.
AKP: వేతనాలు పెంచాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. బుధవారం ఎలమంచిలి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. మే నెలలో వేసవి సెలవులు ఇవ్వాలన్నారు.