TG: సీసీఐ పత్తి కొనుగోళ్ల గడువు ఈ నెలాఖరు వరకు పెంచారు. ఈనెల 20తో ముగిసినట్లు అధికారులు ప్రకటించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పందించి సీసీఐ సీఎండీతో మాట్లాడారు. ఎంపీ విజ్ఞప్తితో సానుకూలంగా స్పందించిన అధికారులు కొనుగోళ్లను మరో ఏడు రోజులు పొడిగించనున్నట్లు ప్రకటించారు.
KKD: సామర్లకోట భీమేశ్వర లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలు నుంచి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని క్లబ్ అధ్యక్షుడు అమలకంటి శ్రీనివాసరావు తెలిపారు. ఈ శిబిరంలో పెద్దాపురం భార్గవ్ ఆసుపత్రి వైద్యులచే అన్ని వ్యాధులకు పరీక్షలు చేసి మందులు అందజేస్తారని తెలిపారు. ఈ సేవలను సద్విని యోగం చేసుకోవాలని పట్టణ ప్రజలను కోరారు.
NLG: నిరుద్యోగ యువతీ, యువకుల కోసం వివిధ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారిని పద్మ తెలిపారు. ఎంపికైన వారు నల్గొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుందని, నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం ఉంటుందని పేర్కొన్నారు. టెన్త్-డిగ్రీ వారు అర్హులని వెల్లడించారు.
కోనసీమ: ఇవాళ సెలవు దినమైనప్పటికీ, అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని ఎపీఈపీడీసీఎల్ ఎస్ఈ ఎస్. రాజేశ్వరి తెలిపారు. వినియోగదారుల సౌకర్యార్థం సెక్షన్ ఆఫీస్ కౌంటర్లు, ఏటీపీ (ATP) కేంద్రాలు కూడా తెరిచి ఉంటాయని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
AP: ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఇవాళ ‘ఆర్గానిక్ రైతోత్సవం’ జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల సేంద్రీయ ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు విక్రయాలు కూడా నిర్వహించనున్నారు. ఆర్గానిక్ ఆహార ప్రాముఖ్యతపై వినియోగదారులకు అవగాహన కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. పలువురు అధికారులు, రైతులు ఈ ఉత్సవానికి హాజరుకానున్నారు.
కోనసీమ: తిరుమల శ్రీవారిని వైసీపీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. శనివారం మంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వేంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని మంత్రి ధ్వజమెత్తారు. భక్తుల మనోభావాలను వైసీపీ నాయకులు పదేపదే దెబ్బతీస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
సత్యసాయి: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సోమందేపల్లిలోని జామియా మజీద్‌లో ఆదివారం నాలుగవ ఉపవాస దీక్షను ముస్లిం మైనారిటీ సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే మజీద్‌కు చేరుకున్న ముస్లింలు వజు చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పవిత్ర ఖురాన్ పారాయణం, నమాజ్ నిర్వహించి ఆధ్యాత్మిక వాతావరణంలో ఉపవాస దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా ఐక్యతను చాటారు.
పెసరపప్పు ఇడ్లీలు అధిక ప్రోటీన్, తక్కువ కేలరీలు కలిగిన ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. పెసరపప్పులో ఉండే విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆవిరిపై ఉడికించడం వల్ల ఈ ఇడ్లీలు కడుపుకు తేలికగా ఉంటాయి, త్వరగా జీర్ణమవుతాయి. తక్కువ కొవ్వు, కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఉత్తమమైన ఆహారం.
MNCL: భీమారం మండలం నర్సింగాపూర్‌లో దొంగతనం జరిగింది. SI రాజేందర్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుంటి సత్తయ్య కుటుంబ సభ్యులతో కలిసి శనివారం వివాహానికి వెళ్లాడు. తిరిగి రాత్రి వచ్చి చూసేసరికి ఇంటి తాళం, బీరువా పగులగొట్టి ఉన్నాయి. సుమారు 5 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ASF: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) నిబంధనల ప్రకారం 2025-26 సీజన్‌కు సంబంధించి మద్దతు ధర (MSP) వద్ద పత్తి కొనుగోలు ప్రక్రియ ఈ నెల 27వ తేదీతో ముగియనుంది. ఈ మేరకు మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. రైతులు ఈ కొద్ది రోజులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
NDL: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భక్తులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. భక్తుల బస కోసం కేటాయించిన ఓ వీఐపీ కాటేజీలోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ASF: కాగజ్ నగర్‌లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన వివాహ వేడుకలో అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా కాల్చడంతో అందులోంచి వచ్చిన మినుగురులు వరుడి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన టెంటుపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకొని టెంటు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
SDPT: కోహెడ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గడ్డం కృష్ణయ్య, ఎంపీవో రవీందర్ రెడ్డి మండలంలోని వార్డు సభ్యులకు శిక్షణ సదస్సు నిర్వహించారు. ఐదు రోజులపాటు జరిగిన శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. అధికారులు బాలాజీ, కుమార్, మాధవి అందించగా.. శిక్షణ పూర్తి చేసిన వార్డ్ సభ్యులకు గ్రామ కార్యదర్శి మాధురి చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలను అందజేసి అభినందించారు.
ATP: శెట్టూరు మండలంలో విధులకు గైర్హాజరైన 104 మంది గ్రామ సచివాలయ సిబ్బందికి ఎంపీడీవో జిలానీబాషా శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలైనా కార్యాలయాలకు రాకపోవడం, సర్వేలపై నిర్లక్ష్యం వహించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, ఏఎన్ఎంలు, మహిళా పోలీసులకు నోటీసులు ఇచ్చారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా డైరెక్టర్ జగన్మోహన్ కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆదివారం లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేయాలని ఆయన సూచించారు.