SDPT: బెజ్జంకి మండలం పాపయ్యపల్లి గ్రామంలో సోమవారం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్ పెద్దన్న, వార్డ్ సభ్యుడు తిప్పారపు మహేష్ పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్ జమున, మదర్ కమిటీ సభ్యులు, తల్లులు హాజరయ్యారు.
JGL: పెగడపల్లి మండల పరిషత్ ఇంఛార్జ్ అభివృద్ధి అధికారిగా శశి కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఎంపీడీవోగా పని చేస్తున్న ప్రేమ్ సాగర్ 45 రోజులపాటు శిక్షణ తరగతులకు వెళ్లారు. దీంతో ఇక్కడే మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న శశి కుమార్ రెడ్డికి, ఇంఛార్జ్ ఎంపీడీవోగా నియమిస్తూ జిల్లా పరిషత్ సీఈవో గౌతంరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
MHBD: పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన రసాల ఐలయ్య, మేడుదల చెన్నమల్లు, కుందూరు వెంకన్నలు ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం వారి స్వగ్రామానికి వెళ్లి మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
MBNR: ఉమ్మడి జిల్లా రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. మహబూబ్ నగర్-2,44,853, నాగర్ కర్నూల్-3,29,128, గద్వాల్-1,79,052, వనపర్తి-1,87,633, నారాయణపేట- 1,90,153 మంది రైతులు ఉన్నారు. గతేడాది నవంబర్‌లోనే రైతు భరోసా అందవలసి ఉండగా.. ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
VKB: జిల్లా కేంద్రం నుంచి ఎకమామిడి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు నరకం చూపిస్తోంది. రోడ్డంతా ధ్వంసం కావడంతో వాహనాలు వెళ్లే సమయంలో భారీగా దుమ్ము రేగుతుండటంతో స్థానికులు, ప్రయాణికులు శ్వాసకోశ ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణం భయానకంగా ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
PDPL: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం నుంచి గోదావరిఖని పట్టణ చౌరస్తా వరకు సోమవారం 5-K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా MLA MSరాజ్ ఠాకూర్, నగర మేయర్ మహంకాళి స్వామి పాల్గొని 5కే రన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌లు, స్వచ్ఛంద సంఘాల యువకులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
CTR: మామిడి రైతులు గతేడాది భారీ నష్టాలను చవిచూశారు. అయితే పల్ప్ యూనిట్లు మాత్రం ఉత్పత్తి అయిన 5 లక్షల మెట్రిక్ టన్నుల పల్ప్‌లో దాదాపు 75% విక్రయించాయి. ఇందులో 45%కి పైగా పల్ప్ కంపెనీలకు ట్రాన్స్‌పోర్ట్ కాగా, మరో 25-30% సీజన్ మొదలయ్యే లోపు రవాణా కానుంది. ఈసారి మామిడికి మంచి రేట్లు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో మామిడి రైతుల ఆశలు నెరవేరనున్నాయి.
అన్నమయ్య: పీటీఎం మండలం రాపూరివాండ్లపల్లెలో CRPF కానిస్టేబుల్ బత్తల సురేష్ (40) అనుమానాస్పద స్థితిలో సోమవారం మృతి చెందారు. వైజాగ్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన, సెలవుపై ఇంటికి వచ్చి సమీపంలోని దోసకాయల తోటలో శవమై కనిపించడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
NZB: ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం మంగళవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు సోమవారం తెలిపారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, బీ.టెక్ పూర్తి చేసినవారు అర్హులని చెప్పారు. ఆసక్తి గల వారు ధ్రువపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని సూచించారు. 18-35 ఏళ్ల లోపు వారు అర్హులని పేర్కొన్నారు.
KMM: సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో HPV వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఎమ్మెల్యే మట్ట రాగమయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 14 నుంచి 15 సంవత్సరాల వయసు గల ఆడపిల్లలు ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఎస్.కె రహేన, కౌన్సిలర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
NDL: మహానంది మండలం గాజులపల్లెలో 83 మంది డప్పు, చర్మకారుల పింఛన్ దారులకు నోటీసులు ఇవ్వడం దారుణమని MRPS జిల్లా నాయకులు కోలా కళ్యాణ్, దర్గయ్య విమర్శించారు. బాధితులతో కలిసి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఇవాళ ఆందోళన చేపట్టారు. అనంతరం ఏవో శ్రీనివాసరెడ్డిని కలిసి సమస్యపై చర్చించి లబ్ధిదారులకు తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
నెల్లూరు రూరల్ పరిధిలోని 21వ డివిజన్, మాగుంట లే అవుట్‌లోని రూ. 15.50 లక్షలతో నిర్మిస్తున్న సీసీ డ్రైన్ పనులను కార్పొరేషన్ అధికారులతో కలిసి టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 21వ డివిజన్ అభివృద్ధికి రూ. 3.26 కోట్ల నిధులు కేటాయించామన్నారు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు, తొలితరం పాత్రికేయుడు ఓరుగంటి వెంకటరమణయ్య వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఇందులో మాజీ MLA జంకె వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వెంకటరమణయ్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆ రోజుల్లో ఇన్ని సదుపాయాలు, సాంకేతికత ఉండేదికాదని, ప్రజా సమస్యలపై రమణయ్య ఎనలేని కృషి చేశరని ఆయన అన్నారు.
శ్రీకాకుళం: కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే సత్ఫలితాలు సాధించవచ్చునని ఎంఈఓ 2 ఎన్.వీ ఆర్ ఎస్ ప్రసాదరావు తెలిపారు. సోమవారం జలుమూరు మండల కేంద్రంలోని కస్తూరి గురుకుల పాఠశాలను ప్రిన్సిపాల్ యశోదతో కలిసి పదవ తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్‌ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు మరో వారం రోజుల్లోనే ఉన్నాయని, ఇష్టపడి చదవాలన్నారు.