CTR: బీసీ సంఘం పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షుడు కృష్ణమూర్తి మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. బీసీల ఐక్యత కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, దీక్షలు చేపట్టారు. మత్సకారులకు ఓ ప్రత్యేకమైన గుర్తింపును కూడా నియోజకవర్గంలో ఆయన తీసుకువచ్చారు. ఆయన మృతిపై బీసీ సంఘం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వివిధ రాజకీయ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు.
GNTR: ప్రజా ఆరోగ్యం దృష్ట్యా MTMC కమిషనర్ అలీమ్ బాషా మంగళవారం నగరంలోని తాగునీటి పంప్ హౌస్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పైప్‌లైన్ లీకేజీలను వెంటనే అరికట్టాలని సిబ్బందిని ఆదేశించారు. నీటి నాణ్యతను పరీక్షించేందుకు నమూనాలను గుంటూరు ల్యాబ్‌కు పంపాలని సూచించారు. తాగునీటిలో ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు వెంటనే కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.
KRNL: ఆలూరు(మం) మొలగవల్లిలో జయన్నకు చెందిన 2 గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. చెత్తలోని నిప్పురవ్వ గాలికి ఎగిరి వామికి అంటుకోవడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. గ్రామస్తుల సహకారంతో పక్కనున్న నాలుగు వాములు కాపాడబడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.1.30 లక్షలు విలువ చేసే పశువుల మేత కాలిపోవడంతో రైతు కన్నీరుమున్నీరయ్యారు.
MLG: తాడ్వాయి మండలం కాటాపురం గ్రామంలో మంగళవారం నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దిడ్డి మోహన్ రావు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామస్థుల సౌకర్యార్థం నాణ్యతా ప్రమాణాలతో రోడ్డు పనులు సమయానికి పూర్తి చేస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. వార్డు మెంబర్లు ఉన్నారు.
కోనసీమ: రామచంద్రపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి అక్కల రిశ్వంత్ రాయ్ ఛైర్మన్‌గా మార్చి 8న ప్రమాణస్వీకారం చేయనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రామచంద్రపురంలో మంత్రి సుభాశ్ ఆధ్వర్యంలో సన్నాహాక సమావేశం నిర్వహించారు. మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కీలక నేతలు హాజరవుతారని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
తూ.గో: జిల్లా రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి, కాకినాడ సబ్ రిజిస్ట్రార్ ఆర్.వెంకటరామారావు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది. సంఘ అధ్యక్షునిగా ఎం.సత్యనారాయణ రాజు, ప్రధాన కార్యదర్శిగా ఎంవీవీ కృష్ణ, ఉపాధ్యక్షునిగా బీఎస్‌ఆర్ మూర్తి, తదితరులు ఎన్నికయ్యారు.
MNCL: జైపూర్ మండలం ఇందారం క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గోదావరిఖనికి చెందిన శ్రీనివాస్ (43) TVS ఎక్సెల్ బైక్ ఒక్కసారిగా అదుపుతప్పడంతో కిందపడి గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి జైపూర్ పోలీసులు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. నస్పూర్ అంబులెన్స్ EMT ప్రదీప్, పైలట్ అరవింద్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు.
WGL: గీసుకొండ మండలంలోని కొమ్మాల జాతర సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గులాబీ ప్రభ బండ్లు సిద్ధం చేసినట్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు గిర్నీబావి నుండి ప్రభ బండ్ల ర్యాలీ ప్రారంభం కానుందని ఆయన పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, హాజరు కావలసిందిగా పిలుపునిచ్చారు.
ప్రకాశం: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు, పోలీస్ అధికారులు ఒంగోలు పోలీస్ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మహిళా దినోత్సవ వారోత్సవాల భాగంగా వారం రోజులపాటు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం టీజీ రాష్ట్ర కార్యదర్శిగా కట్టంగూరు మండలంలోని ఎరసానిగూడెంకు చెందిన బండారు శంకర్‌ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ నియమించారు. SC, ST, BC మైనార్టీ విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తూ, సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని శంకర్ తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ మరోసారి టీమిండియాపై తన అక్కసును వెళ్లగక్కాడు. భారత్ సెమీస్ చేరదని వ్యాఖ్యానించి నవ్వులపాలైన అమీర్, ఇప్పుడు టీమిండియా ఫైనల్ చేరదని అన్నాడు. గతంలో భారత్ సెమీస్‌కు వెళ్లదని తాను వేసిన అంచనా కరెక్టే కానీ, సంజూ శాంసన్ ఒక్కడి వల్లే భారత్ గెలిచిందన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో టీమిండియా విఫలమవుతుందని తెలిపాడు.
ADB: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఊరట లభించింది. చెన్నూర్‌లో నిరసన చేపట్టిన కేసులోనూ కోర్టు మంగళవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ADB జిల్లా జైలు నుంచి ఈ నెల 4న ఉదయం ఆయన విడుదల కానున్నట్లు న్యాయవాది శ్రీకాంత్ తెలిపారు. దీంతో గత నెల 18నుంచి ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న సుమన్ రేపు బయటకు రానున్నారు.
PPM: ద్విచక్ర వాహనాలపై సురక్షితంగా ప్రయాణం సాగించేందుకు ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని ట్రాఫిక్ SI పాప రావు అన్నారు. ప్రతి సంవత్సరం చాలా మంది వాహనదారులు రహదారి ప్రమాదాలలో కేవలం హెల్మెట్ ధరించని కారణంగానే మరణిస్తున్నారని తెలిపారు. వాహనదారులు హెల్మెట్ ధరించక పోవడం వలన రహదారి ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాల పాలై, ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.
KNR: హైదరాబాదులోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో సిరిసిల్ల కలెక్టర్ గరీమ అగర్వాల్ పాల్గొన్నారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు చేపట్టనున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం ఆదర్శ క్రీడా పాఠశాలలో రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు శ్యాంసుందర్ రావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరై కోచ్‌కు రిపోర్ట్ చేయాలని సూచించారు. అర్హత సాధించిన వారు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారన్నారు.