అన్నమయ్య: మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ జీవి పల్లవికి హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోలేదనే ఆరోపణలపై దాఖలైన కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు ధిక్కారంగా భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఆమెను అరెస్ట్ చేసి ఈనెల 30న కోర్టులో హాజరుపరచాలని ఎస్పీకి ఆదేశాలు జారీ అయ్యాయి.
KRNL: కర్నూలు రేంజ్ పరిధిలో అర్ధరాత్రి భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. 25 మంది సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ డా. కోయప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలలో ఈ పోస్టింగ్లు ఇచ్చినట్లు వెల్లడించారు. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సిఫార్సుల మేరకు కొందరిని వీఆర్‌కు పంపామన్నారు.
TPT: పాతనాలపాడు పంచాయతీ రామరాజుపల్లిలోని హరి రాము (22) మూడు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన కుమారుడు అల్లిగడ్డకు వెళ్లాడని అతని తండ్రి సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేసినట్లు ఇన్‌ఛార్జ్ ఎస్సై సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
CTR: పీఎం సూర్య ఘర్ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సోలార్ విద్యుత్ పథకం అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే థామస్ తెలిపారు. జీడీ నెల్లూరు ఎస్సీ కాలనీలో కలెక్టర్ సుమిత్ కుమార్‌తో కలిసి సోమవారం ఆయన పథకాన్ని ప్రారంభించారు. సుమారు 5 వేల మంది లబ్ధిదారులకు రూ. 60 కోట్ల అంచనా వ్యయంతో దీనిని అమలు చేస్తున్నామని వెల్లడించారు.
W.G: పాలకొల్లుకు చెందిన మరుధూరి నర్సింహాచార్యులు, బొచ్చు రవికుమార్ ‘నవ నారసింహ క్షేత్రాల’ సైకిల్ యాత్రకు బయలుదేరారు. ఇవాళ ఉదయం శ్రీ దాసోహ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించారు. 20 రోజులపాటు 1800 కి.మీ. ఈ యాత్ర సాగనుందని, మంగళగిరి, వేదాద్రి, పెంచలకోన, అహోబిలం, కదిరి, ధర్మపురి, యాదగిరిగుట్ట నారసింహ క్షేత్రాలు దర్శించుకుంటామన్నారు.
PPM: సాలూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ ఛార్జిగా డాక్టర్ హేమా నాయక్ బాధ్యతలు స్వీకరించారు. వైజాగ్ భాజపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పీవీ ఎన్ మాధవ్ చేతులమీదుగా నియామకపత్రం అందుకున్నారు. పార్టీ అభి వృద్ధికి కృషి చేస్తానని, కూటమి పాలనలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని హేమానాయక్ అన్నారు.
NDL: కోవెలకుంట్ల మండల పరిధిలో వివిధ సబ్ స్టేషన్‌లలో వ్యవసాయ రంగానికి పగలు 9 గంటల విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఏఈ రామమోహన్ తెలిపారు. కొప్పర్ల, ఆమడాల, కలుగొట్ల, హరివరం వంటి పలు గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ అందుబాటులో ఉంటుందన్నారు. రైతులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
GNTR: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్‌లో పర్యటనపై సమీక్షించిన కలెక్టర్, ఈ నెల 15న జరిగే కార్యక్రమం విజయవంతం కావాలంటే శాఖల మధ్య సమన్వయం కీలకమని పేర్కొన్నారు.
AKP: అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్ క్రీడామైదానంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో కైలాసపట్నం జట్టు విజేతగా నిలిచింది. అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో 16 టీమ్స్ పాల్గొన్నాయి. కైలాసపట్నం జట్టు ప్రథమ స్థానం దక్కించుకోగా, ఏటికొప్పాకకు ద్వితీయ స్థానం, చింతపల్లి జట్టు మూడో స్థానంలో నిలిచింది.
బాపట్ల: కొరిశపాడు మండలం మెదరమెట్లలోని ఒంగోలు రోడ్డు నందు సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అద్దంకి నుంచి శ్రీశైలం వెళుతున్న బస్సును రాంగ్ రూట్‌లో వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు పగిలిపోగా బస్సులో ఉన్న కొప్పెరపాడుకు చెందిన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే దేవ కుమారి అనే మహిళకు గాయాలు అయ్యాయి. ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
NLR: సైదాపురం మండలం ఊటుకూరు పరిధిలోని ఆదూరుపల్లి ఎస్టీ కాలనీ తోటలో ఆదివారం రాత్రి భార్యపై భర్త దాడి చేసిన ఘటన నెలకొంది. భార్యపై అనుమానంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపంతో భర్త కత్తితో భార్య మెడపై దాడి చేశాడు. భార్య తీవ్రంగా గాయపడింది. స్థానికులు 108 ద్వారా గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
GNT: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గతంలో జరిగిన అవకతవకలపై విచారణ సాగినా స్పష్టత లేదు. నిధుల వినియోగం, నియామకాలలో అక్రమాల ఆరోపణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. విజిలెన్స్ నివేదిక విడుదల కాకపోవడంతో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చర్యలు లేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.
సత్యసాయి: సోమందేపల్లి మండలం కేతగాని చెరువు గ్రామంలో సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పెద్దన్న మాట్లాడుతూ ఫేస్ యాప్ ఫోటోను వ్యతిరేకిస్తూ మేట్లకు ఉచితంగా సెల్ ఫోన్ ఇవ్వాలని, కూలీలకు పని ముట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
NDL: ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్స్ జాయింట్ సెక్రటరీగా ఆదివారం డోన్ ఎంవిఐ క్రాంతికుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు సహచర అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ పదవితో MVIల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని ఆయన తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు.