CTR: విజయపురం మండలంలోని పలు గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా విజయపురం మండలంలోని గాండ్ల కండ్రిగ గ్రామంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను స్థానిక నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు రమేష్ రాజుతో కలిసి మండల పరిషత్ అధ్యక్షులు లక్ష్మీపతి రాజు గారు పరిశీలించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించాలన్నారు.
అన్నమయ్య: రైల్వేకోడూరు జనసేన MLA అరవ శ్రీధర్ బాధితురాలు వీణ హైకోర్టును ఆశ్రయించారు. MLA తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనను మోసం చేశారని, పైగా తనపై తప్పుడు కేసులు పెట్టించారని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే తల్లితో ఫిర్యాదు చేయించడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఎమ్మెల్యే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించింది. వీణపై నమోదైన కేసు చెల్లదని పేర్కొంది.
GNTR: దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో రెండు నూతన హెల్త్ & వెల్నెస్ (విలేజ్) సెంటర్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. మంత్రి నారా లోకేష్ చొరవతో రూ. 72 లక్షల వ్యయంతో ఈ కేంద్రాలు నిర్మించనున్నారు. కూటమి నాయకులు శంకుస్థాపన నిర్వహించి, ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యమని పేర్కొన్నారు.
BPT: రేపల్లె నియోజకవర్గంలో రూ. 31 కోట్లతో చేపట్టిన 28 ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్ పనులు 90 శాతం పూర్తయ్యాయని మంగళవారం మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.
TPT: పుత్తూరులో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఆర్.వెంకటేష్ మాట్లాడుతూ.. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. “చలో విజయవాడ” సందర్భంగా విజయవాడలో అంగన్వాడీల అరెస్టులను ఖండిస్తూ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
KRNL: ఆదోని తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో వాహనాలు నడిపిన నలుగురిపై కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. సోమవారం సీఐ నల్లప్ప మాట్లాడుతూ.. మొదటి అదనపు కోర్టులో హాజరుపరచగా, ఇద్దరికి ఏడు రోజులు, ఒకరికి పది రోజులు జైలు శిక్ష విధించారు. మరొకరికి రూ. 10 వేల జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
NTR: తిరువూరు బోసుబొమ్మ సెంటర్లోని సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు మంగళవారం ధర్నా నిర్వహించారు. విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యలని జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు అన్నారు. జీతాలు పెంచే వరకు పోరాటం ఆగదని అంగన్వాడీలు నినాదించారు. ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీనీ నెరవేర్చాలని కోరారు.
NDL: పాములపాడు(మం) భానుముక్కలలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆరోగ్య కేంద్రానికి ఎమ్మెల్యే గిత్త జయసూర్య మంగళవారం భూమిపూజ చేశారు. గ్రామ ప్రజల ఆరోగ్య సౌకర్యాల మెరుగుదల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. గ్రామస్తులు, నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
కృష్ణా: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా పోలీస్ సిబ్బందికి ప్రత్యేక వైద్య పరీక్షలు, రక్తదాన శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. టూ టౌన్ సీఐ హనీష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా మహిళా పోలీస్ సిబ్బంది ఆరోగ్యం పెంపొందించడంతోపాటు వారి శ్రేయస్సు పట్ల పోలీస్ శాఖకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
SKLM: పలాస మండలం నీలిపద్ర గ్రామంలో మంగళవారం రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ టీపీసీ ఛైర్మన్ బాబు రావు, టీడీపీ జిల్లా కార్యదర్శి విఠల్ రావు హాజరై రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసిందన్నారు.
అనకాపల్లి మండలం మామాడిపాలెం, తగరంపూడి గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పలు ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మామిడిపాలెం జడ్పీ హైస్కూల్లో కొత్తగా నిర్మించిన అదనపు తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, ఎస్సీ కాలనీలో పార్క్‌ను ప్రారంభించారు. అనంతరం తగరంపూడిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
GNTR: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అర్హులైన ముగ్గురు మత్స్యకారులకు 60 శాతం, 40 శాతం రాయితీతో మూడు చక్రాల వాహనాలను గుంటూరులో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి పి.ఎన్. కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. పథకం ద్వారా మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడుతుందని తెలిపారు.
VZM: జీతాలు పెంచాలని అమరావతిలో శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అక్రమ అరెస్టు చేశారు. వారిని బేషరతుగా విడుదల చేయాలని మంగళవారం కొత్తవలస కూడలిలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు గాడి అప్పారావు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, తమిళనాడు తరహాలో అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.
NLR: కోవూరు మండలం పాటూరు గ్రామ వైసీపీ నూతన కమిటీని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ కమిటీని ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నూతన కార్యవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
VSP: అగనంపూడి జోన్ 77వ వార్డులో సుమారు రూ.7.5 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, కార్పొరేటర్ బట్టు సూర్యకుమారితో కలిసి తారు, సీసీ రోడ్లు, కల్వర్ట్లు, కాలువల నిర్మాణ పనులు ప్రారంభించారు. నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మేయర్ తెలిపారు.