PLD: గరికపాడు గ్రామంలో సోమవారం రాత్రి పర్యటించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, అక్కడ నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మౌలిక వసతుల మెరుగుదల కోసం ఏప్రిల్ నెలలో రూ. 20 లక్షలు విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మొఘల్ జాను, కూటమి నాయకులు పాల్గొన్నారు.
GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని వ్యాయామ కళాశాలలో గతేడాది డిసెంబరులో నిర్వహించిన మూడో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు సీఈ ఆలపాటి శివప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం 302 మంది పరీక్ష రాయగా 294 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. జవాబు పత్రాల పునఃమూల్యాంకన కోసం ఈ నెల 27లోపు ఒక్కో పేపర్‌కు రూ.1860 చెల్లించాలన్నారు.
NTR: ఇటీవల ఇబ్రహీంపట్నంలో టీడీపీ శ్రేణులు బాంబులతో దాడి చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద జరిగిన నష్టాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
BPT: పంగులూరు మండలం ముప్పవరంలో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జరిగింది. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన 91 మందికి మొత్తం రూ. 77.33 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఈ నిధులు ఎంతో ఊరటనిస్తాయని మంత్రి పేర్కొన్నారు.
SKLM: మెళియాపుట్టి మండలంలోని చాపర గ్రామంలో ఎల్లమ్మ (జామి) జాతర ఇవాళ ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎల్లమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని గమనించి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.
VZM: చీపురుపల్లిలో జరుగుతున్న కనకమహాలక్ష్మి అమ్మవారి 28వ జాతర పురస్కరించుకుని వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక సేవలు అందిస్తున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ గవిడి నాగరాజా సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వారికోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసామని, మంగళవారం కూడా భక్తులు అమ్మవారి దర్శనాలు, మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు.
NDL: వెనుకబడిన రాయలసీమను 12 జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొంచెం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోమవారం చాగలమర్రిలో నాయకులతో కలిసి మాట్లాడారు. దశాబ్దాలుగా పాలకులు సీమకు అన్యాయం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయన డిమాండ్ చేశారు.
KRNL: కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ.కుమారస్వామి సోమవారం మంత్రాలయాన్ని సందర్శించి శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనాన్ని దర్శించుకున్నారు. గురు వైభవోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మఠం పీఠాధిపతి సుభుధేంద్ర తీర్థ స్వామి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం హెలిప్యాడ్ వద్ద అధికారులు, నాయకులు ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలికారు.
PLD: సత్తెనపల్లిలోని గ్రంథాలయం ఎదుట ఉన్న రోడ్డు డివైడర్‌పై సోమవారం రాత్రి ఒక వ్యక్తి శవమై కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. మృతుడు మద్యం మత్తులో ప్రాణాలు విడిచి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: సోషల్ మీడియాలో మహిళా పోలీసును వేధించిన ఏఆర్ కానిస్టేబుల్ గురుమోహన్ రెడ్డిపై అనంతపురం నగర పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు కానిస్టేబుల్ ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా మహిళకు అసభ్యకర సందేశాలు పంపుతూ వేధింపులకు పాల్పడ్డాడు. దీనిని గమనించిన బాధితురాలి భర్త (పోలీస్ అధికారి) నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ELR: విద్యార్థుల ప్రవర్తనను తల్లిదండ్రులతో పాటు చిల్లర దుకాణాల యజమానులు నిరంతరం గమనిస్తుండాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సైకిల్ పంచర్ గ్లూ, వైట్నర్, ఫెవికాల్ వంటి వస్తువులను విద్యార్థులు తరచూ కొనుగోలు చేస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ నిర్మూలనే ధ్యేయంగా పోలీస్ శాఖ పనిచేస్తోందన్నారు.
BPT: బల్లికురవ మండలం వైదన గ్రామ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. పిడుగురాళ్ల నుంచి అద్దంకి వైపు వెళ్తున్న ఓ లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై, టోల్‌ప్లాజా అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని అద్దంకి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అనకాపల్లి: గురుకులాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో అప్పారావు నాయుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నర్సీపట్నం గురుకుల పాఠశాలలో బాలురు, అచ్యుతాపురంలో బాలికలకు 5వ తరగతి, 6, 7, 8 తరగతులలో మిగులు సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 10 గురుకుల కళాశాలలో ప్రవేశాలకు ఈనెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చనన్నారు.
KDP: బలపనూరు 132/33 కేవీ సబ్‌స్టేషన్లో అత్యవసర పనులు చేయనున్నట్లు ఏఈ బాలసంజీవులు తెలిపారు. ఈ కారణంగా మంగళవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భద్రంపల్లి, తొండూరు, మల్లెల సబ్‌స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ ఫీడర్లకు విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు సహరించాలని ఆయన కోరారు.