గత వారమంతా అప్‌ట్రెండ్‌లో నడిచిన బంగారం, వెండి ధరలు, ఈ వారంలో కాస్త తగ్గడం, మరుచటి రోజు మళ్లీ కాస్త పెరగడం అన్నట్లుగా ఉన్నాయి. బుధవారం అర వెయ్యికి పైగా తగ్గిన వెండి, బంగారం ధరలు గురువారం మళ్లీ పెరిగాయి. దేని ధర ఎంత తగ్గిందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర బుధవారం రూ.67,355 ఉండగా, గురువారం నాటికి రూ.325 పెరిగి రూ.67,680కు చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.67,680గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) బుధవారం రూ.74,410 ఉండగా, గురువారం నాటికి ఏకంగా రూ.1,412 పెరిగి రూ.75,822కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలూ పెరిగాయి. బుధవారం ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 2160 డాలర్లు ఉండగా గురువారం పదకొండు డాలర్లు పెరిగి 2171 డాలర్లకు చేరుకుంది. అలాగే ఔన్స్ వెండి(Silver) ధర 24.99 డాలర్లుగా ఉంది.