ప్రపంచంతో పాటు భారత స్టాక్ మార్కెట్లో కరోనా భయాలు కమ్ముకున్నాయి. ఈ నెలలోనే 63,000 మార్కు పైకి చేరుకున్న సెన్సెక్స్ ఆ తర్వాత అంతర్జాతీయ పరిణామాలతో నష్టపోయాయి. ఆ తర్వాత కాస్త పుంజుకున్నట్లు కనిపించినప్పటికీ, చైనాలో కోవిడ్ బీఎఫ్ 7 వేరియంట్ ఆందోళనలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. నెల రోజుల క్రితం చైనాలో కరోనా ఆంక్షలు ఎత్తివేయడంతో రోజుకు వేలు, లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. జపాన్, అమెరికాలోను కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత్ సహా ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. కోవిడ్ మళ్లీ పుంజుకుంటుండంతో ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ పైన కనిపిస్తోంది. దీంతో ఈ వారం వరుసగా నాలుగు సెషన్లు సూచీలు అంతకంతకూ నష్టపోయాయి. సెన్సెక్స్ గత నెల రోజుల్లో దాదాపు 2500 పాయింట్లు, పదిహేను రోజుల్లో 2800 పాయింట్లు నష్టపోయింది. కేవలం గత నాలుగైదు సెషన్లలోనే 1500 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ ఏకంగా 60,000 పాయింట్ల దిగువకు, నిఫ్టీ 18000 పాయింట్ల దిగువకు వచ్చింది.
గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.16 లక్షల కోట్లు క్షీణించి, 272 లక్షల కోట్లకు పడిపోయింది. సెన్సెక్స్ నిన్న ఒక్కరోజు 980 పాయింట్లు నష్టపోయింది. అంటే 1.60 శాతానికి పైగా క్షీణించింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను వేగంగా పెంచుతుందనే అంచనాలు, దీనికి తోడు కోవిడ్ భయాలు కలవడంతో గత ఆరు నెలల కాలంలోనే భారత షేర్లు అత్యంత దారుణంగా పతనమయ్యాయి. అమెరికా థర్డ్ క్వార్టర్ జీడీపీ డేటా, ఇతర డేటా అంచనాలను మించింది. దీంతో ఫెడ్ వడ్డీ రేట్లలో దూకుడు ఉంటుందని భావిస్తున్నారు. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు చివరలో స్వల్పంగా నష్టపోయాయి.
కరోనా వేవ్ పెరుగుతున్నా కొద్ది గతంలో వలె పలు ఫార్మా స్టాక్స్ ర్యాలీ చేయవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా కరోనా సంబంధిత వ్యాక్సీన్, ఇతర ఉత్పత్తులు తయారీ చేసే ఫార్మా, సంస్థల స్టాక్స్ వేగంగా వృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే చైనాలో పెరుగుతున్న కరోనా కేసులను పక్కన పెడితే, మన వద్ద తాజా వేరియంట్ ప్రభావాన్ని బట్టి స్టాక్స్ వృద్ధి ఉంటుందని, కాబట్టి అప్పుడే ఎంచుకోవడానికి తొందరపడవద్దనేది నిపుణుల సూచన. ఆచితూచి అడుగు వేయాలని అంటున్నారు. ఎగుమతులు చేసే ఫార్మా కంపెనీలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.