విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పైన (Vizag-Secunderabad Vande Bharat Express Train) మరోసారి రాళ్ల దాడి జరిగింది. బుధవారం నాడు భాగ్యనగరం నుండి విశాఖ వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఖమ్మం – విశాఖ మధ్య రాళ్ల దాడి చేశారు. దీంతో సీ8 బోగీ అద్దం పగిలిపోయింది. దెబ్బతిన్న అద్దాలను మార్చాల్సి వచ్చింది. ఈ రూట్లో నడుస్తున్న ఈ రైలు పైన గత మూడు నెలల కాలంలో ఇది మూడో రాళ్ల దాడి. అంతకుముందు జనవరి నెలలో విశాఖలో మెయింటెనెన్స్ సందర్భంగా రాళ్ల దాడి జరిగింది. కోచ్ కేర్ సెంటర్ కు వెళ్తున్న సమయంలో కంచరపాలెంలో జరిగిన ఈ ఘటనలో గ్లాస్ పేన్ పగిలిపోయింది. ఇప్పుడు మూడోసారి దాడి జరిగింది. ప్రజలు ఎవరు కూడా ఇలా దాడులు చేయకూడదని, ఇది ప్రజల ఆస్తి అని రైల్వే శాఖ సూచిస్తోంది.
బుధవారం రాళ్ల దాడి నేపథ్యంలో గురువారం (ఏప్రిల్ 6) వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును రీషెడ్యూల్ చేశారు. విశాఖ నుండి సికింద్రాబాద్ కు ఆలస్యంగా బయలుదేరుతుందని ప్రకటించింది రైల్వే శాఖ. ఉదయం గం.5.45కు బయలుదేరాల్సిన రైలు నాలుగు గంటలు ఆలస్యంగా గం.9.45కు బయలుదేరుతుందని తెలిపింది. దెబ్బతిన్న అద్దాన్ని మార్చవలసిన ఉండటంతో ఆలస్యమవుతున్నట్లు వాల్తేరు సీనియర్ అధికారి ఎస్కే త్రిపాఠి చెప్పారు. ‘ఈ ఘటన దురదృష్టకరం. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేయడంతో అద్దం పగిలింది. కంచరపాలెం ప్రాంతంలో దాడి జరిగింది. సీసీటీవీ వీడియో ఫుటేజీని తనిఖీ చేస్తున్నాం. తమ ఆర్పీఎఫ్ పోలీసులు కూడా దుండగుల కోసం గాలిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత కఠినమైన చర్యలు తీసుకుంటాం. రైల్వే ప్రజల ఆస్తి. ప్రజలు ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దు. ఈ గ్లాస్ ఖరీదు రూ.1 లక్ష’ అని చెప్పారు.