Uttam Kumar:పోస్టింగులపై మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటి వెనక కాంగ్రెస్ ముఖ్యులు ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. సమయం తీసుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. పోస్టింగుల వెనక ఎల్లిగాడో.. మల్లిగాడో.. ప్రశాంత్ గాడో లేడని ఉత్తమ్ అన్నారు. పై నుంచి చేయించారని తెలిపారు. ఆ పోస్టింగులు తన వ్యక్తిత్వాన్ని హననం చేసేట్టు ఉన్నాయని వివరించారు. గత కొంతకాలంగా ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు భట్టి విక్రమార్క, వి హనుమంతరావు, జగ్గారెడ్డి తదితర సీనియర్లపై ట్రోలింగ్ నడుస్తోంది.
నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సొంత పార్టీ కార్యకర్తలే ట్రోలింగ్ చేశారు. యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న ప్రశాంత్, ఆయన టీమ్ అనుచిత పోస్టులు పెట్టారు. విచారణ చేపట్టిన సీసీఎస్ పోలీసులు (CCS Police) కేసు నమోదు చేశారు. సొంత పార్టీకి చెందిన వారిపై ట్రోలింగ్ చేసినందుకు హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. యూత్ కాంగ్రెస్ (Youth Congress) వార్ రూమ్ ఇన్ఛార్జ్ ప్రశాంత్పై వేటు వేసింది.
మే 5వ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar)సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ నెంబర్ నుంచి తనపై పదే పదే ట్రోలింగ్ జరుగుతోందని తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ నెంబర్ ఆధారంగా కూపీ లాగారు. ఉత్తమ్ ఇంటికి సమీపంలోని ఫ్లాట్ నుంచి ట్రోలింగ్ జరుగుతున్నట్టు గుర్తించి సోదాలు నిర్వహించారు. సదరు ఫ్లాట్ యూత్ కాంగ్రెస్ పేరుతో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.