ఇటీవల కుంగిన మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ఏర్పాట్లు చేయాలని నీటి పారుదల శాఖ అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సమీక్ష నిర్వహించారు.
Minister Uttam: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam) అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో గల మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ సందర్శనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల బ్యారేజీ పిల్లర్ కుంగిన సంగతి తెలిసిందే. అది తీవ్రమైన అంశం అని ఉత్తమ్ అన్నారు. నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జలసౌధలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టుల గురించి ఈఎన్సీ మురళీధరరావు మంత్రి ఉత్తమ్‌కు వివరించారు.
మేడిగడ్డ నిర్మాణం చేపట్టిన సంస్థ, అధికారులు పర్యటనలో ఉండేలా చూడాలని మంత్రి ఉత్తమ్ (Uttam) స్పష్టంచేశారు. మేడిగడ్డ నిర్మాణం కోసం రూ.4600 కోట్లు ఖర్చు చేశాం అని ఈఎన్సీ మురళీ ధరరావు తెలిపారు. ఒక పిల్లర్ 1.2 మీటర్లు కుంగడంతో మరో 3 పిల్లర్లపై ఆ ప్రభావం పడిందని తెలిపారు. ముందురోజు సాయంత్రం పిల్లర్ కుంగిన వెంటనే ప్రాజెక్టులో నీటిని తోడేశామని వివరించారు. నీరు తోడిన తర్వాత పిల్లర్ కుంగడం తగ్గిందన్నారు. పిల్లర్ కుంగడం తీవ్రమైన అంశం అని.. ప్రాజెక్ట్ సందర్శనకు ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్ తేల్చిచెప్పారు. అక్కడ ఖర్చు చేసిందెంత..? ఎంత ఆయకట్టుకు నీరిచ్చేందుకు నిర్మాణం జరిగింది..? ఎకరాకు సాగుకు అవుతున్న ఖర్చు ఎంత అని అధికారులను అడిగారు.