జానకీపురం సర్పంచ్ నవ్య(Sarpanch Navya) కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసును జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటోగా స్వీకరించాయి. ఈ క్రమంలో విచారణ వేగవంతం చేయాలని కమిషన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నవ్యకు కాజీపేట ఏసీపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై గల ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలు ఇవ్వాలని పోలీసులు కోరారు. మూడు రోజుల్లో సమర్పించాలని వెల్లడించారు. అయితే గతంలో నవ్యను రాజయ్య లైంగికంగా వేధిస్తున్నారని నవ్య ఆరోపణలు చేసింది.
మళ్లీ ఇటీవల అగ్రిమెంట్ పేరుతో తనను రాజయ్య వేధిస్తున్నారని ఎమ్మెల్యే రాజయ్య(mla rajaiah)తోపాటు మరో నలుగురిపై సర్పంచ్ నవ్య ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే తన నిధుల నుంచి గ్రామాభివృద్ధికి 25 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారని నవ్య అంటోంది. ఇదే విషయమై మరోసారి వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిధులు ఇవ్వలేదని, డబ్బులు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోందని నవ్య ఆరోపించింది. ఈ విషయమై నవ్య భర్త ప్రవీణ్ ఎమ్మెల్యేను నిలదీశారు. గ్రామాభివృద్ధికి 25 లక్షలు, వ్యక్తిగతంగా మరో 20 లక్షలు ఇస్తానని రాజయ్య హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే డబ్బులు అడిగితే అగ్రిమెంట్‌పై సంతకం చేయాలని ఎమ్మెల్యే ఒత్తిడి చేశారని నవ్య చెబుతోంది.