రాజ్యసభ మాజీ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి(92)(Solipeta Ramachandra Reddy) మంగళవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నివాసంలో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రామచంద్రారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామచంద్రారెడ్డి వివిధ హోదాల్లో సిద్దిపేటతో పాటు తెలంగాణ ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న తొలి తరం కమ్యూనిస్టు నేతగా రామచంద్రారెడ్డి సేవలు ఆదర్శనీయమన్నారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా ఆ తర్వాత ఎంపీగా రాజకీయాల్లో ఆయన ఎదుగుదల నాలాంటి ఎందరో నాయకులకు, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం. సిద్దిపేటకు చెందిన వ్యక్తిగా, రాజకీయ, సామాజిక సేవలో ఆయన సాధించిన విజయాలు ఈ ప్రాంతానికి చెందిన నాలాంటి ఎందరో నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తాయని సీఎం కొనియాడారు. సోలిపేట రామచంద్రారెడ్డి మృతితో తెలంగాణ మరో తొలి తరం ప్రజానాయకుడిని కోల్పోయిందని అన్నారు.
సోలిపేట రామచంద్రారెడ్డి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో జన్మించారు. తెలంగాణ(telangana) సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. హైదరాబాదులోని సిటీ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యాక, రామచంద్రారెడ్డి రాజకీయాలలో పూర్తి సమయం పనిచేశాడు. చిట్టాపూర్ సర్పంచ్‌గా, దుబ్బాక సమితి అధ్యక్షుడిగా, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా, దొమ్మాట ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, టీడీపీ పార్లమెంటరీ పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్‌గా, అనేక ఇతర హోదాల్లో సేవలందించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన భౌతికకాయాన్ని బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ప్రజల అంతిమ నివాళులర్పించారు. ఈరోజు సాయంత్రం ఫిల్మ్ నగర్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.