జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు ఆదరణ పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల ప్రముఖులు వచ్చి కేసీఆర్ తో సమావేశమవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీతో కలిసి వస్తామని ప్రకటించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తమిళనాడుకు చెందిన పలువురు ప్రముఖులు కేసీఆర్ కు మద్దతుగా నిలిచారు. ఆయా రాష్ట్రాలకు చెందిన పలు పార్టీలు బీఆర్ఎస్ లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యాయి కూడా. ఇప్పుడు తాజాగా చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోకి కూడా బీఆర్ఎస్ అడుగు పెట్టనుంది. బీఆర్ఎస్ పార్టీకి ఇది కీలక అడుగు కాబోతున్నది.
ఛత్తీస్ ఘఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ తనయుడు, జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమిత్ జోగీ బుధవారం సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ప్రగతి భవన్ కు ఆయన వచ్చారు. అమిత్ జోగీ, సీఎం కేసీఆర్ తో సుధీర్ఘంగా సమావేశమయ్యారురు. ఈ సందర్భంగా… తెలంగాణ అభివృద్ధి, దేశంలోని రాజకీయ పరిణామాలు, జాతీయ వ్యవహారాలపై వారిద్దరూ లోతుగా చర్చించినట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. బీఆర్ఎస్ జాతీయ పార్టీ విధి విధానాలను ఆసక్తితో సీఎం కేసీఆర్ ను అడిగి తెలుసుకున్నారని తెలిపింది. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్న్యాయ రాజకీయ శక్తుల అవసరం ఉందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ జాతీయ పార్టీని స్థాపించడాన్ని ఈ సందర్భంగా అమిత్ జోగి ఆహ్వానించారు. తెలంగాణ పాలనను దేశానికి ఆదర్శంగా నిలిపారని, సంక్షేమం అభివృద్ధి రంగాల్లో దేశంలో ముందు వరసలో తెలంగాణను నిలిపేందుకు కృషి చేశారని సీఎం కేసీఆర్ ను ఆయన అభినందించారు. సమావేశం అనంతరం తన తండ్రి ఛత్తీస్ ఘఢ్ మాజీ సీఎం అజిత్ జోగీ ఆత్మకథను సీఎం కేసీఆర్ కు బహూకరించారు.
ఈ సమావేశంతో చత్తీస్ ఘడ్ లో బీఆర్ఎస్ పార్టీ అడుగు పెట్టనుందని తెలుస్తున్నది. సీఎం కేసీఆర్ ఆహ్వానం ఉన్నా లేకున్నా ఆయన హైదరాబాద్ వచ్చి భేటీ కావడం చర్చనీయాంశమైన విషయమే. ప్రస్తుతానికి చత్తీస్ ఘడ్ లో అమిత్ జోగి పార్టీ జనతా కాంగ్రెస్ కు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీని విలీనం చేస్తే బీఆర్ఎస్ కు ఊహించని శక్తి లభిస్తుంది. కేసీఆర్ నాయకత్వానికి మరింత బలం చేకూరనుంది.