»Stopped Registration Services Across Ap State 2023
AP: వ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఈరోజు కూడా సర్వర్లు మోరాయించడంతో భూముల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు జూన్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మంగళవారం కూడా సర్వర్లు మోరాయించాయి. దీంతో చలాన్లు చెల్లించి ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌కు స్లాట్లు బుక్ చేసుకున్న వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. జూన్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సర్వర్లు మోరాయిస్తున్న క్రమంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో గంటల కొద్ది సమయం రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే గడపాల్సి వస్తుందని వాపోతున్నారు. దీంతోపాటు ఆయా కార్యాలయాలలో సరైన తాగునీరు సౌకర్యాలు కూడా లేవని రోజంతా ఎండలో నిరీక్షించాల్సి వచ్చిందని అంటున్నారు. థంబ్ ఇంప్రెషన్, డాక్యుమెంటేషన్ తనిఖీలు వంటి ఇతర అన్ని ఫార్మాలిటీలను అధికారులు పూర్తి చేశారని పలువురు తెలుపగా. వీటన్నింటి తర్వాత తదుపరి స్పందన లేకపోవడంతో రోజంతా రిజిస్ట్రార్ కార్యాలయంలోనే వేచి ఉండాల్సి వచ్చిందని అంటున్నారు. సర్వర్ ఎందుకు పనిచేయడం ఆగిపోయింది, ఎప్పుడు పునరుద్ధరిస్తుందనే సమాచారం ఎవరికీ ఇవ్వడం లేదని ప్రజలు చెబుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో 18 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. ఒక్కో కార్యాలయంలో దాదాపు 100 నుంచి 150 రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్లు పూర్తికాకపోవడంతో ఉదయం నుంచి ఆయా కార్యాలయాల వద్ద భూముల విక్రయదారులు, కొనుగోలుదారులు, డాక్యుమెంట్ రైటర్లు బారులు తీరారు. మరోవైపు జూన్ 1 నుంచి ఆయా ప్రాంతాలను బట్టి మార్కెట్ విలువ 30 శాతం నుంచి 80 శాతానికి పెరుగుతుందని అనధికారికంగా చెబుతున్నారు.
స్టాంప్ డ్యూటీలను తగినంతగా చెల్లించడం ద్వారా అన్ని పత్రాలు అప్లోడ్ చేయబడ్డాయి. కానీ ప్రింటర్ పనిచేయకపోవడంతో రిజిస్టర్డ్ వ్యక్తులకు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదని డాక్యుమెంట్ రైటర్ ఎం శర్మ తెలిపారు. గుంటూరు జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల నుంచి కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. రెండు రోజుల పాటు రిజిస్ట్రేషన్లను స్తంభింపజేయడం ద్వారా కొత్త మార్కెట్ విలువ ధరలకు స్టాంపు డ్యూటీలు వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని అనపర్తికి చెందిన కొనుగోలుదారు చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చట్టవిరుద్ధం అని ఆయన ఆరోపించారు.