»Devotees Rush To Tirupati Ttd Stopped Sarva Darshan Tokens Issued
Tirupati:లో పోటెత్తిన భక్తులు..టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల తిరుపతి ఆలయానికి గత కొన్ని రోజులుగా భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. శ్రీవారి దర్శనానికి 30 గంటలకుపైగా సమయం పడుతుంది. ఇలాంటి నేపథ్యంలో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
తిరుమల తిరుపతి(Tirupati)శ్రీవారి ఆలయానికి భక్తులు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సాధారణంగా భక్తులు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు 30 గంటలకుపైగా సమయం పడుతుంది. అంటే ఒకరోజు కంటే ఎక్కువగా పడుతుంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 1, 7, 8, 14, 15 తేదీల్లో సర్వదర్శన టోకెన్ల జారీని ఆపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు ఈ మేరకు స్పష్టం చేశారు. భక్తులు టోకెన్లు తీసుకునే విషయంలో ఈ తేదీలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులు సూచించారు.
సెప్టెంబరు 30న తమిళ పెరటాసి మాసం, రెండవ శనివారం కావడంతో భక్తులు(Devotees) మరింత మంది తిరుమలకు వచ్చారు. నారాయణగిరి ఉద్యానవనం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసిన తర్వాత దర్శనం క్యూ లైన్లు 5 కిలోమీటర్ల మేర విస్తరించాయి. టోకెన్లు లేని వారికి దర్శనం కోసం వేచి ఉండే సమయం 30 గంటలు దాటింది. ఈ క్రమంలో ఆలయం వద్ద ఉన్న రెండు క్యూ కాంప్లెక్స్‌లు పూర్తిగా నిండిపోయాయి. అయితే అక్టోబరు 2వ తేదీ వరకు వరుస సెలవులు ఉండటం కూడా రద్దీకి కారణమని అధికారులు చెబుతున్నారు.
క్రౌడ్ మేనేజ్మెంట్ చర్యల్లో భాగంగా ఉచిత ఆహార ప్యాకెట్లు(free food), తాగునీటిని నిరంతరాయంగా సరఫరా చేయడానికి తిరుపతి నుంచి సీనియర్ అధికారులను పట్టణంలో నియమించారు. దాదాపు 2,500 మంది శ్రీవారి సేవా వాలంటీర్లను దర్శనం లైన్లలో వేచి ఉన్న భక్తుల అవసరాలను తీర్చడానికి నియమించారు. లడ్డూ కౌంటర్లు, లగేజీ కౌంటర్లు, రిసెప్షన్, కల్యాణకట్ట, యాత్రికులు ఎక్కువగా ఉండే ఇతర పాయింట్ల వద్ద కూడా వారు సేవలందిస్తున్నారు.