»Sonia Gandhi To Visit Hyderabad In Next Month June 2023
Sonia Gandhi: హైదరాబాద్ కి సోనియాగాంధీ, విశేషమేంటో?
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) హైదారాబాద్ వచ్చే నెలలో రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ తనకు రెండో ఇల్లు లాంటిదని ఈ రాష్ట్ర ప్రజలు తన కుటుంబంపై కురిపించిన ప్రేమను తాను ఎప్పటికీ మరచిపోలేనని ప్రియాంక ఇటీవల హైదరాబాద్ వచ్చిన క్రమంలో పేర్కొన్నారు. అంతేకాదు తన తల్లి సోనియా గాంధీ తెలంగాణను ప్రకటించిన బాధ్యతను కూడా గుర్తు చేశారు. ఆ క్రమంలో ప్రియాంక కూడా మళ్లీ రానున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ మాజీ చీఫ్, సీనియర్ నేత సోనియా గాంధీ(Sonia Gandhi) జూన్ తొలి వారంలో హైదరాబాద్ రానున్నారు. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న సోనియా గాంధీ సడెన్ గా హైదరాబాద్ పర్యటనకు రానుండటం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఆమె పర్యటనపై రాజకీయ విశ్లేషణలు కూడా మొదలయ్యాయి.
అయితే ఆమె పీసీసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ బోయినపల్లిలో నిర్మించతలపెట్టిన ‘గాంధీ ఐడియాలజీ సెంటర్’ భవనానికి శంకుస్థాపన చేయడానికి వస్తుండటం గమనార్హం. వైఎస్సార్ హయాంలో బోయినపల్లి శివారులో కాంగ్రెస్ పార్టీకి పదెకరాల స్థలాన్ని కేటాయించారు.
ఆ స్థలంలో గాంధీ ఐడియాలజీ సెంటర్ నిర్మాణానికి అనుమతి కోరుతూ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి కంటోన్మెంట్ బోర్డుకు దరఖాస్తు చేసుకోగా బుధవారం అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో నిర్మాణ పనులు ప్రారంభించాలని పీసీసీ నిర్ణయించింది.
ఈ భవనంలో గాంధీ భావజాలాన్ని తెలిపే లైబ్రరీతోపాటు పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను వీక్షించేలా థియేటర్, గాంధీ కుటుంబ సభ్యులు హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ బస చేసేలా ఏర్పాట్లు ఉంటాయి.
అలాగే ఏఐసీసీ అధ్యక్షుడికి ప్రత్యేక చాంబర్, పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా భవనాన్ని డిజైన్ చేస్తున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి సోనియాతోపాటు రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఇతర ముఖ్య నేతలను ఆహ్వానించనున్నట్టు పీసీసీ తెలిపింది.