»Sensational Things Come To Light In Hyderabad Terror Case Mp
Hyderabad: ఉగ్రకుట్రలో వెలుగులోకి సంచలన విషయాలు..17కు చేరిన అరెస్టులు
హైదరాబాద్ ఉగ్ర కుట్ర కేసు(Hyderabad terror case) విచారణలో భాగంగా కీలక విషయాలు తెలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇస్లాం మతం వ్యాప్తితోపాటు ఉగ్ర కుట్ర కోసం నిందితులు మూడంచెల విధానాన్ని అనుసరించారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు ఈ కేసులో నిన్న మరొకరిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్(hyderabad) ఉగ్రదాడి కుట్ర కేసులో అరెస్టైన వారి నుంచి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశాన్ని విధ్వంసం చేసేందుకు కుట్ర పన్నిన ఉగ్రవాద సంస్థ హిజ్బుత్ తెహ్రీర్ ఉచ్చులో చాలా మంది చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సలీం, రెహ్మాన్, అబ్బాస్, హమీద్, జునైద్, సల్మాన్‌లను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. వీరితో ఎవరెవరికి సంబంధాలున్నాయన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులందరూ ఏడాదిన్నరగా ఇక్కడ రాడికల్ ఇస్లాం కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నట్లు చెబుతున్నారు. హిజ్బుత్ తెహ్రీర్ ఆధ్వర్యంలో తరుచు బయాన్ పేరుతో సభలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలకు రాష్ట్రంలోని జిల్లాల నుంచి చాలా మంది హాజరైనట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.
అంతేకాదు వీరు యువతను ఆకర్షించేందుకు కీ ఆఫ్ రైట్ పాత్ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. దీని ద్వారా మాత మార్పిడి, ఇస్లాం గురించి క్లాసులు ప్రసంగాలు చెప్పేవారని విచారణలో తేలింది. అంతేకాదు తర్వాత క్రమంగా ఆయుధాలు, ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇచ్చారని తెలుసుకున్నారు. మూడంచెల విధానం ద్వారా ఇప్పటికే ఆ ఛానెల్లో 33 వీడియోలు అప్ లోడ్ చేయగా..3,600 మంది సబ్ స్ర్కైబర్లు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న ముఠా సభ్యులు ఎవరికీ అనుమానం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. నిందితులు గోల్కొండ, టోలీచౌకి, మల్లేపల్లి, జవహర్‌నగర్, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. తాము ఉంటున్న ఇంటి నంబర్లకు బదులు పక్క ఇళ్లలో ఉంటున్నట్లుగా ఆధార్ కార్డులు తయారు చేశారు. రోజు కూలీ నుంచి దంతవైద్యుడి వరకు నిందితులు ఉన్నారు.
దీంతోపాటు నిందితులు హైదరాబాద్ శివారులోని పర్యాటక ప్రాంతమైన అనంతగిరి గుట్టలో శిక్షణ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తుపాకులు కాల్చడం, కత్తులు, గొడ్డళ్లతో దాడి చేయడంలో శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. 48 గంటల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండేలా శిక్షణ కూడా తీసుకున్నట్లు సమాచారం. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రత్యేకంగా హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, ప్రభుత్వ కార్యాలయాల్లో దాడులకు ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మాల్స్‌పై దాడులు చేసి తమ ఆధీనంలో ఉంచుకునేందుకు భారీ కుట్ర జరిగిందని పేర్కొన్నారు. నిందితుడు యాసిర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం సిద్ధంగా ఉందన్నారు. యాసిర్ ఇప్పటి వరకు 50 మందిని రిక్రూట్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ సమావేశాలకు ఎవరెవరు వస్తున్నారనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలోని సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. ఉగ్రవాద సంస్థ హిజ్బ్-ఉత్-తెహ్రీర్ సభ్యులు ఎక్కువగా విద్యావంతులు, ధనవంతులేనని పోలీసులు వెల్లడించారు. అయితే ఎంత మందిని ఉగ్రవాదం వైపు మళ్లించారనే దానిపై పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు.
ఈ కేసులో మధ్యప్రదేశ్ పోలీసులు భోపాల్, హైదరాబాద్‌లలో ఏకకాలంలో దాడులు చేసి 16 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిలో అయిదుగురు హైదరాబాద్‌కు చెందిన వారున్నారు. బుధవారం మరో వ్యక్తిని అరెస్టు చేయడంతో నిందితుల సంఖ్య 17కు చేరింది.