కన్యాకుమారిలోని నాగర్‌కోయిల్ సమీపంలో ప్రభుత్వ బస్సు, కారు ఎదురెదురుగా వచ్చి ఆకస్మాత్తుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. 9 మంది గాయాలయ్యాయి.
కన్యాకుమారి జిల్లాకు చెందిన నృత్య, పాటల బృందం తిరుచెందూర్ సమీపంలోని ఆలయ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ క్రమంలో నాగర్‌కోయిల్ నెల్లై జాతీయ రహదారిలోని వెల్లమడం ప్రాంతంలోని వంకలో అనూహ్యంగా ప్రభుత్వ బస్సును కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు కారు నుజ్జునుజ్జు కావడంతో 8 మంది తీవ్ర గాయాలతో ప్రాణాలతో పోరాడుతున్నారు.
ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆచారిపాళ్యం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.