»Sircilla Not Golmal Gujarat This Is Golden Telangana Says Brs Working President Kt Rama Rao
గోల్ మాల్ గుజరాత్ కాదు.. ఇది Golden Telangana: మంత్రి కేటీఆర్
రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లలోనే ఎట్లున్న తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో మన కండ్ల ముందే ఉందని కేటీఆర్ చెప్పారు. జాతీయ స్థాయిలో తెలంగాణ సత్తా చాటుతోందని.. దానికి నిదర్శనమే జాతీయ అవార్డులు రావడమని పేర్కొన్నారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ (BRS Party) శ్రేణులు పండుగ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 27న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం (Formation Day) సందర్భంగా బీఆర్ఎస్ మంగళవారం నియోజకవర్గ ప్రతినిధుల సభలు నిర్వహించింది. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని పార్టీ ప్రతినిధులతో మాట్లాడారు. ఇదే సమయంలో సిరిసిల్ల (Sircilla)లో నిర్వహించిన సమావేశంలో మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KT Rama Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ (K Chandrashekar Rao)కు కాలి గోటికి కూడా సరిపోయే నాయకుడు ప్రతిపక్షాల్లో ఒక్కరూ లేరు. కేసీఆర్ పాలనలో ప్రతి గ్రామం ఆదర్శంగా మారింది. దేశ జనాభాలో 3 శాతం ఉన్న తెలంగాణకు 30 శాతం జాతీయ అవార్డులు లభించాయి’ అని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రస్థానం విషయమై కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. ‘22 ఏళ్ల కిందట హైదరాబాద్ (Hyderabad) జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. ఇప్పుడు 60 లక్షల మంది గులాబీ దండు ఉంది. వారికి పేరుపేరునా ధన్యవాదాలు. దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ రూపాంతరం చెందింది. మారింది టీఆర్ఎస్ పేరు మాత్రమే.. జెండా, గుర్తు, డీఎన్ఏ (DNA) మారలేదు’ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ గా రూపాంతరం చెంది మహారాష్ట్రలో సత్తా చాటుతున్నామని తెలిపారు.
‘2013లో ఆంధ్రప్రదేశ్ (AP) నుంచి వెళ్తున్నా.. తెలంగాణతోనే (Telangana) అడుగుపెడతానని కేసీఆర్ చెప్పారని, అన్నట్టుగానే తెలంగాణ సాధించి తిరిగి వచ్చారు’ అని గుర్తుచేశారు. లక్ష్యాన్ని సాధించిన కేసీఆర్ జన్మధన్యమైందని నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee) కొనియాడారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లలోనే ఎట్లున్న తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో మన కండ్ల ముందే ఉందని చెప్పారు. జాతీయ స్థాయిలో తెలంగాణ సత్తా చాటుతోందని.. దానికి నిదర్శనమే జాతీయ అవార్డులు రావడమని పేర్కొన్నారు. ఇది గోల్ మాల్ గుజరాత్ కాదు.. గోల్డెన్ తెలంగాణ (Golden Telangana) అని ప్రకటించారు. 2018లో ప్రతి కార్యకర్త తనే అభ్యర్థిగా భావించి పని చేయడంతోనే సిరిసిల్లలో తాను 89 వేల మెజార్టీతో గెలిపొందినట్లు గుర్తు చేసుకున్నారు. ఊరూరా కార్యకర్తలు గులాబీ జెండాలు ఎగురవేస్తుంటే గుండె ఉప్పొంగి పోతుందని కేటీఆర్ తెలిపారు.